డ్రైనేజీ పనుల్లో రూ.కోటి అవినీతి
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:12 AM
అబీద్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే గణేశ్ హయాంలో చేపట్టిన డ్రైనేజీ పనుల్లో రూ.కోటి అవినీతి జరిగిందని రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తేల్చారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అనవసర ఖర్చులు పెట్టడం వలన మునిసిపాలిటీలో అభివృద్ధి జరగలేదన్నారు.
- నిగ్గు తేల్చిన రాష్ట్ర విజిలెన్స్ అధికారులు
- స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడి
నర్సీపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): అబీద్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే గణేశ్ హయాంలో చేపట్టిన డ్రైనేజీ పనుల్లో రూ.కోటి అవినీతి జరిగిందని రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తేల్చారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అనవసర ఖర్చులు పెట్టడం వలన మునిసిపాలిటీలో అభివృద్ధి జరగలేదన్నారు. అబీద్ సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు చేపట్టిన డ్రైనేజీ పనుల్లో జరిగిన అవినీతిపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి రూ.కోటి అవినీతి జరిగిందని తేల్చారని చెప్పారు. సంబంధిత కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలని ఆదేశించారని తెలిపారు. అప్పట్లో పని చేసిన ఇద్దరు మునిసిపల్ అధికారులను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో బలిఘట్టంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. గత ఐదేళ్లు డంపింగ్ యార్డులో చెత్త తరలించకపోవడం వలన కొండలా పేరుకుపోయి వర్షం వచ్చినప్పుడు అందులోని మురుగు నదిలో కలుస్తున్నదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ కంపెనీకి 320 టన్నులు చెత్త తరలించారన్నారు. ఇంకా అక్కడ 6,300 టన్నుల చెత్త ఉందని తెలిపారు. మునిసిపాలిటీలో చెత్త సమస్య పరిష్కారం కోసం రూ.52 లక్షలతో కాంపాక్టర్ కొనుగోలు చేశామని చెప్పారు. రెండు హైడ్రాలిక్ ట్రాక్టర్లు రూ.36 లక్షలతో కొనుగోలు చేశామని, త్వరలో కొత్తగా ఎక్స్‌కవేటర్ కూడా రాబోతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో పారిశుధ్య వాహనాలు, పని సామగ్రి కోసం రూ.1.3 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో వాళ్లు ఏం చేశారో?, ఈ ఏడాది కాలంలో తాము ఏం చేశామో పోల్చి చూడాలన్నారు. మునిసిపాలిటీలో సమగ్ర మంచినీటి పథకం కోసం సీఎం చంద్రబాబును అడిగి రూ.166 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ కూడా పూర్తి చేశామని, రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పారని తెలిపారు. రూ.కోటి మినరల్ గ్రాంట్, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 కోట్లు, వీఎంఆర్డీఏ రూ.4.11 కోట్ల నిధులతో మునిసిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మునిసిపాలిటీని అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణాన్ని తీర్చుకుంటానన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 12:12 AM