ఉక్కులో దిద్దుబాటు
ABN, Publish Date - Jun 19 , 2025 | 01:19 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం దూకుడుగా వెళుతోందని, వివిధ విభాగాల్లో అవసరమైన మరమ్మతులు చేయకుండా పూర్తి ఉత్పత్తికి సిద్ధమవుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని స్టీల్ మంత్రిత్వశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్లాంటులో వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు జనరల్ మేనేజర్లు, ముగ్గురు డీజీఎంలు, ఒక సీజీఎం...మొత్తం తొమ్మిది మందితో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
తొమ్మిది మంది ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ
పూర్తి స్థాయి ఉత్పత్తికి యాజమాన్యం దూకుడుగా వెళుతుందన్న ఆరోపణల నేపథ్యంలో
స్టీల్ మంత్రిత్వశాఖ నిర్ణయం
వివిధ విభాగాల్లో 30 ప్రాజెక్టుల సత్వర పూర్తికి ఆదేశం
బడ్జెట్, కేటాయింపులు, ప్రాథమిక అనుమతులు,
టెండర్ల తయారీ, ఖరారు వంటి విధుల నిర్వహణ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం దూకుడుగా వెళుతోందని, వివిధ విభాగాల్లో అవసరమైన మరమ్మతులు చేయకుండా పూర్తి ఉత్పత్తికి సిద్ధమవుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని స్టీల్ మంత్రిత్వశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్లాంటులో వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు జనరల్ మేనేజర్లు, ముగ్గురు డీజీఎంలు, ఒక సీజీఎం...మొత్తం తొమ్మిది మందితో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. వీరంతా కలిసి వీలైనంత త్వరగా ముఖ్యమైన 30 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని బాధ్యతలు అప్పగించింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటులో ఆరు ప్రాజెక్టులు, కోక్ ఓవెన్ అండ్ కోల్ కెమికల్ ప్లాంటులో తొమ్మిది ప్రాజెక్టులు, సింటర్ ప్లాంటులో ఎనిమిది, బ్లాస్ట్ ఫర్నేస్‌లో రెండు, ఎస్‌ఎంఎస్-1లో ఒకటి, ఎస్‌ఎంఎస్-2లో మరొకటి, రోలింగ్ మిల్, వైర్ రాడ్ మిల్స్‌లో మూడు ప్రాజెక్టులు తక్షణమే చేపట్టాలని ఆదేశించింది. వీటికి అవసరమైన బడ్జెట్, కేటాయింపులు, ప్రాథమిక అనుమతులు, క్లియరెన్స్‌లు, అంచనా వ్యయాల రూపకల్పన, టెండర్ల తయారీ, ఖరారు, గడువులోగా పూర్తి వంటి విధులన్నీ ఈ కమిటీ నిర్వహించాలని ఆదేశించింది.
ప్రమాదాల నివారణ ధ్యేయంతోనే...
ప్లాంటు చాలాకాలంగా పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. 60 శాతమే ఉత్పత్తి జరుగుతోంది. దాంతో కొన్ని విభాగాలు కొద్దికాలంగా రన్నింగ్‌లో లేవు. ఈ నెల 26వ తేదీ నుంచి బ్లాస్ట్ ఫర్నేస్-3ని ప్రారంభించి 100 శాతం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఆయా విభాగాలకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. కాంట్రాక్టు వర్కర్లను వేల సంఖ్యలో తొలగించడంతో ఆయా పనులు చేసే వారు కరవయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరమ్మతులు చేపట్టకుండా పూర్తి ఉత్పత్తికి వెళితే కచ్చితంగా పెద్ద ప్రమాదాలు జరుగుతాయని ఉద్యోగ, కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే యాజమాన్యం ఇవేమీ తనకు సంబంధం లేదన్నట్టుగా మొండిగా వ్యవహరిస్తోంది. ఈ విషయాలు ప్రజా ప్రతినిధుల ద్వారా ఢిల్లీ పెద్దలకు చెప్పడంతో ఉక్కు మంత్రిత్వ శాఖ నివేదికలు తెప్పించుకుంది. అనేక విభాగాల్లో నిర్వహణ పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించి, వాటిని తక్షణమే చేపట్టాలని ఆదేశించింది. ఈ వ్యవహారాలన్నీ సజావుగా, వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి మెకానికల్, ఎలక్ట్రికల్, సేఫ్టీ ప్రాజెక్ట్స్ విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని వేసింది. వారిని సమన్వయం చేసే బాధ్యతలను వర్క్స్ చీఫ్ జనరల్ మేనేజర్‌కు అప్పగించింది. కమిటీ నియామకంపై ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. తాము ఈ పనులు చేయాలనే మొత్తుకుంటున్నామని, ఎవరు చేసినా తమకు అభ్యంతరం లేదని, ప్రమాదాలకు ఆస్కారం లేని పని వాతావరణం కల్పించాలనేదే తమ డిమాండ్ అని పేర్కొన్నాయి.
Updated Date - Jun 19 , 2025 | 01:19 AM