కరోనా కలకలం
ABN, Publish Date - May 23 , 2025 | 01:21 AM
నగరంలో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టించింది. రెండు, మూడేళ్ల తరువాత మళ్లీ పాజిటివ్ కేసు నమోదైంది.
నగరంలో 28 ఏళ్ల మహిళకు కొవిడ్ పాజిటివ్
ఆరోగ్య శాఖ అప్రమత్తం
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):
నగరంలో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టించింది. రెండు, మూడేళ్ల తరువాత మళ్లీ పాజిటివ్ కేసు నమోదైంది. పిఠాపురం కాలనీలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల మహిళ కొద్దిరోజుల నుంచి చలి, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్య సేవలు అందించే క్రమంలో ఆమెకు కరోనా ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. వెంటనే విషయాన్ని సదరు ఆస్పత్రి అధికారులు ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేశారు. ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు గురువారం ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
కొవిడ్ కేసు నమోదుకావడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నాలుగు టీమ్‌లను ఏర్పాటుచేసి మహిళ నివాసం ఉంటున్న పిఠాపురం కాలనీలో ఇంటింటి సర్వేను నిర్వహించారు. 70 ఇళ్ల పరిధిలోని 200 మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించారు. అలాగే, మహిళ భర్తతోపాటు సోదరి నుంచి నమూనాలు సేకరించి కేజీహెచ్ ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించాలన్నారు.
నేడు టీడీపీ మినీ మహానాడు
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి మినీ మహానాడు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు నగరంలోని పార్టీ కార్యాలయంలో జరగనున్నదని పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ తెలిపారు. మహానాడుకు పార్లమెంటు పరిధిలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
ఏపీఈఏపీసెట్‌కు 95.77 శాతం మంది హాజరు
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్-2025కు గురువారం జిల్లాలో 95.77 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షను ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు. రెండు పూటలా కలిపి 6,550 మంది హాజరుకావాల్సి ఉండగా 6,273 మంది (95.77 శాతం) హాజరయ్యారు.
కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకుల తొలగింపు?
ఐదుగురి బయోమెట్రిక్ నిలిపివేతకు ఉక్కు యాజమాన్యం నిర్ణయం?
ఉక్కుటౌన్‌షిప్, మే 22 (ఆంధ్రజ్యోతి):
కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు ఐదుగురిని ఉద్యోగం నుంచి స్టీల్‌ప్లాంటు యాజమాన్యం తొలగించినట్టు తెలిసింది. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఐదుగురి బయోమెట్రిక్‌ను యాజమాన్యం నిలిపివేసింది. కాంట్రాక్టు కార్మికుల అంశంపై ప్రస్తుతం ఆర్‌ఎల్‌సీ (రీజనల్ లేబర్ కమిషనర్) సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 26న మరోసారి చర్చలు జరగనున్నాయి. ఇదిలావుండగా ప్రస్తుతం ప్లాంటులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా శుక్రవారం అధికారులు సమావేశం కానున్నట్టు తెలిసింది.
కాంట్రాక్టర్‌లతో సమావేశం...
కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో కాంట్రాక్టర్‌లతో గురువారం సాయంత్రం అధికారులు సమావేశమయ్యారు. అప్పగించిన పనులు చేయాలని, కార్మికులను పిలిపించుకోవాలని సూచించారు. అయితే తాము కాంట్రాక్టు కార్మికులపై చర్యలు తీసుకోలేమని, విధులకు రమ్మని మాత్రం చెబుతామని కాంట్రాక్టర్‌లు స్పష్టంచేశారు.
Updated Date - May 23 , 2025 | 01:21 AM