అన్నంను బాగా ఉడికించాలి
ABN, Publish Date - Jul 19 , 2025 | 10:49 PM
విద్యార్థులకు అన్నంను బాగా ఉడికించి పెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రజని వర్కర్లను ఆదేశించారు.
వర్కర్లకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ రజని ఆదేశం
కొత్తభల్లుగుడ బాలిక ఆశ్రమోన్నత పాఠశాల సందర్శన
భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసిన డీడీ
వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి..
అరకులోయ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అన్నంను బాగా ఉడికించి పెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రజని వర్కర్లను ఆదేశించారు. శనివారం మండలంలోని కొత్తభల్లుగుడ బాలిక ఆశ్రమోన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వండిన అన్నం బాగా ఉడికిందా? లేదా? పరిశీలించారు. అలాగే కూర, ఇతర వంటకాలను పరిశీలించారు. అంతేకాకుండా వండిన వంటలను తిని, రుచిని పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వర్కర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం పద్మావతి మాట్లాడుతూ వంటకు, ఇతర పనులకు ఇద్దరు వర్కర్లు చాలడం లేదని, ఉన్నవారిపై పనిభారం అధికంగా పడుతుందని డీడీ దృష్టికి తీసుకువచ్చారు. మరో ఇద్దరు కావాలని కోరగా.. అదనంగా వర్కర్లు కావాలని ప్రభుత్వానికి రాశామని, ఇంకా అనుమతులు రాలేదని డీడీ చెప్పారు. తక్కువ విద్యార్థులు ఉన్న వసతిగృహం నుంచి ఒకరిని నియమించేందుకు ప్రయత్నిస్తానన్నారు. అంతకుముందు ఆశ్రమోన్నత పాఠశాలలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ రజని పాల్గొన్నారు. ప్రతి శనివారం వసతిగృహంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో డీడీ ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించారు. అలాగే కాస్మోటిక్స్ అందాయా? లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమకు వచ్చిన షూల సైజ్‌లు తేడా వచ్చాయని చెప్పడంతో సరిపడే సైజ్‌లు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని, వారిని అనుక్షణం పర్యవేక్షించాలన్నారు. తరచూ విద్యార్థుల విద్యాప్రమాణాల ప్రగతి పరిశీలించాలని, ప్రగతి సూచికలను మెరుగుపరచాలన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 10:49 PM