ఏయూలో అగ్రిమెంట్‌పై రచ్చ
ABN, Publish Date - Jul 15 , 2025 | 01:20 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు అధ్యాపకుల అగ్రిమెంట్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది.
కాంట్రాక్టు అధ్యాపకులతో అగ్రిమెంట్‌కు అధికారుల నిర్ణయం
సంతకాలు చేయించే బాధ్యతను ప్రిన్సిపాల్స్‌కు అప్పగించిన వీసీ
అందులోని నిబంధనలపై అధ్యాపకుల ఆగ్రహం
సంతకం చేసేందుకు నిరాకరణ
విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు అధ్యాపకుల అగ్రిమెంట్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. వివిధ విభాగాల్లో 99 మంది కాంట్రాక్టు అధ్యాపకులు గడిచిన కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. అయితే, ఉన్నత స్థాయి ఆదేశాలతో వర్సిటీ అధికారులు అగ్రిమెంట్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకులతో అగ్రిమెంట్ చేయించుకోవాలంటూ వైస్ చాన్సలర్ నుంచి కాలేజీ ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు అందాయి. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్స్ అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే అందులోని నిబంధనలను వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేందుకు కాంట్రాక్టు అధ్యాపకులు ముందుకురావడం లేదు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకాలు చేయబోమని కాంట్రాక్టు అధ్యాపకులు చెబుతుంటే, అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించే బాధ్యత ప్రిన్సిపాల్స్‌దేనని వైస్ చాన్సలర్ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు జఠిలంగా మారింది.
ఇదీ సమస్య?
వర్సిటీలో పది, పదిహేనేళ్లుగా వివిధ విభాగాల్లో కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. అయితే, వారితో ఒప్పందాలు చేసుకోవాలంటూ ఉన్నత స్థాయి నుంచి వర్సిటీ అధికారులకు ఆదేశాలు అందినట్టు చెబుతున్నారు. ఆ మేరకు పత్రాలను అధికారులు సిద్ధం చేశారు. అయితే, అందులో ఉన్న నిబంధనలు తమకు అన్యాయం చేసేలా ఉన్నాయంటూ కాంట్రాక్టు అధ్యాపకులు చెబుతున్నారు. ‘వర్క్ లేకపోతే తొలగింపు’, ‘ఎట్టి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించకూడదు’, ‘రాజకీయ నాయకులను కలవకూడదు’, ‘ఎప్పుడైనా తొలగించే అధికారం’...వంటి అంశాలు ఉన్నాయి. అవన్నీ తమ హక్కులను హరించేలా ఉన్నాయంటూ కాంట్రాక్టు అధ్యాపకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు అధ్యాపకులంతా సోమవారం ఆయా ప్రిన్సిపాల్స్‌ను కలిసి తాము సంతకాలు చేయబోమని స్పష్టంచేశారు. దీనిపై ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధపడుతున్నట్టు తెలిసింది.
Updated Date - Jul 15 , 2025 | 01:20 AM