నిరంతర పర్యవేక్షణ
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:24 AM
జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, ఫెర్టిలిటీ సెంటర్లు, సరోగసీ కేంద్రాలపై ఆరోగ్యశాఖ దృష్టి సారించింది.
ఆస్పత్రులు, ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారుల దృష్టి
సృష్టి వ్యవహారం నేపథ్యంలో ఆరోగ్యశాఖ నిర్ణయం
తనిఖీ బాధ్యతలు ప్రొగ్రామ్ ఆఫీసర్లకు అప్పగింత
విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, ఫెర్టిలిటీ సెంటర్లు, సరోగసీ కేంద్రాలపై ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. వీటిని నిరంతరం పర్యవేక్షించేలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు ప్రొగ్రామ్ ఆఫీసర్లకు బాధ్యతలను అప్పగించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి వ్యవహా రం వెలుగులోకి వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ప్రత్యేకం గా ఆరోగ్యశాఖతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఫెర్టిలిటీ సెంటర్లు, సరోగసీ కేంద్రాలపై దృష్టిసారించాలని, నిబంధనలు పాటించని వాటిపై కఠినంగా వ్యవహరించా లని ఆదేశించారు. అదే సమయంలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీల కోసం అధికారులను నియమించారు. వీరిలో డెమో, జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసర్, జిల్లా ఉమెన్ హెల్త్ ఆఫీసర్ ఉన్నారు. వీరంతా తొలుత జిల్లాలో ఉన్న 53 ఫెర్టిలిటీ సెంటర్లు, సరగోసీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశాలు జారీచేశారు. ప్రతిరోజూ ఐదు కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఆయా కేంద్రాల్లో జరిగిన ప్రతి కేసుకు సంబంధించిన ఫైళ్లను క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. సృష్టి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు ఆధ్వర్యంలో 11 ఫెర్టిలిటీ సెంటర్లు, సరోగసీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. మిగిలిన వాటిని అధికారులు తనిఖీ చేయనున్నారు.
రెండో దశలో ఆస్పత్రుల తనిఖీ
మొదటి దశలో సరోగసీ, ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు నిర్వహించేలా నిర్దేశించారు. రెండో దశలో ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు, డెంటల్ హాస్పిటల్స్‌లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, డెంటల్ క్లినిక్స్ 252 ఉన్నాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించేలా సదరు అధికారులకు ఆదేశాలు అందాయి. ఫెర్టిలిటీ సెంటర్లు, సరగోసీ కేంద్రాలకు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆయా కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నట్టు సమాచారం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు ఆయా కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఏదైనా సమస్య వెలుగులోకి వచ్చిన తరువాత అధికారులు హడావిడి చేయడం, తరువాత పక్కన పెట్టేయడం పరిపాటిగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Updated Date - Aug 04 , 2025 | 12:24 AM