‘నిరంతర’ అవాంతర పథకం!
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:43 AM
నగరంలో నిరంతర నీటి సరఫరా పనులు ఏళ్లుగా కొలిక్కి రావడం లేదు.
ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు
నత్తనడకన సాగుతున్న పనులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు
24 గంటల నీటి సరఫరాకు జనం ఎదురుచూపులు
మురళీనగర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
నగరంలో నిరంతర నీటి సరఫరా పనులు ఏళ్లుగా కొలిక్కి రావడం లేదు. నిత్యం తవ్వకాలు, మరమ్మతులే దర్శనమిస్తున్నాయి. దీంతో పైలెట్ ప్రాజెక్టు చేపట్టినప్పటికీ ఆయా ప్రాంతాలకు నిత్యం నీరు సరఫరా కావడం లేదు. తాజాగా 48ఎ బస్ రూట్ సీతన్నగార్డెన్స్ ఉడాక్వార్టర్సు ప్రవేశమార్గంలో కొత్తగా వేసిన తారు రోడ్డును తవ్వి పైపులైను పనులు చేపడుతున్నారు. దీంతో ఈ పథకం పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఏడీబీ నిధులతో 2018 నుంచి జీవీఎంసీ చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు ఇంకా కార్యరూపం దాల్చలేదు. 2019లో ప్రభుత్వం మారడంతో నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ రూ.380 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రారంభించిన ఈ పనుల్లో రివర్స్ టెండరింగ్, బిల్లుల విడుదలలో ఆలస్యం తదితర కారణాలతో జాప్యం జరిగింది. దీంతో రైవాడ నుంచి నగరానికి తాగునీటిని అందించే ప్రాజెక్టు నత్తనడకన సాగుతోది.
రెండు నియోజకవర్గాల్లో...
ముందుగా విశాఖ ఉత్తరం, పశ్చిమ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో నివాస సముదాయాలకు ఎప్పుడు కొళాయి తిప్పినా నీరు వచ్చే వెసులుబాటు కల్పిస్తామని పైలెట్ ప్రాజెక్టు కింద పనులు చేపట్టారు. రైవాడ జలాశయం నుంచి ఇనుప పైపులతో నీటిని తరలించేందుకు వీలుగా నగరంలో రోడ్లను తవ్వి లైన్లు వేశారు. జలాశయం నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు వెయ్యి లీటర్ల సామర్థ్యంతో మాధవధార కొండ పక్క బ్లాక్ నంబరు 19, కంచరపాలెం, ఆర్పీపేట, అక్కయ్యపాలెం షాదీఖానా కల్యాణమండపం, కప్పరాడల్లో నీటి సరఫరా ట్యాంకులు నిర్మించారు. కంచరపాలెం ఆర్పీపేట ట్యాంకు నిర్మాణదశలోనే ఉంది.
మోక్షం లభించేనా?
ఇప్పటికీ పైలట్ ప్రాజెక్టు ప్రాంతాల్లో నివాసితులందరికీ నిరంతర నీటి సరఫరా కావడం లేదు. మరో వైపు రోడ్డు మధ్యలో వేసిన ప్రధాన లైన్ల నుంచి ఇళ్లకు అనుసంధానించిన పైపులు, మీటర్లు సక్రమంగా పనిచేయడం లేదు. మురికివాడల్లో వీటి అనుసంధానం ప్రశ్నగానే మారింది. మాధవధార గాంధీనగర్ ప్రాంతంలో ఇళ్లకు అనుసంధానించిన ట్యాపులు, మీటర్ రీడింగ్ బాక్సులు నాణ్యత లేక మరమ్మతులకు గురయ్యాయి. మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లులు వేయడం ప్రారంభం కానప్పటికీ, ఒకేసారి వస్తే చెల్లించే పరిస్థితి లేదని నివాసితులు చెబుతున్నారు.
పదే పదే అవే పనులు
ఎన్‌జీజీఓస్ కాలనీ, మాధవధార, మురళీనగర్ ప్రాంతాల్లో ఇప్పటికీ చేసిన చోటే పనులు చేయడం, తవ్విన చోటే రోడ్లు తవ్వడం రివాజుగా మారింది. మాధవధార తెన్నేటినగర్ దగ్గర బ్లాక్ నంబరు 18కు అనుసంధానం చేసేందుకు ప్రత్యామ్నాయంగా రోడ్డుకు పది అడుగుల లోతున ప్రధాన లైన్లను సరిచేసే పనులు చేపడుతున్నారు. వాస్తవానికి జాతీయ రహదారుల సంస్థ ఈ పనులకు నుంచి అనుమతి లేదని, ఆర్‌అండ్‌బీ జంక్షన్ వద్ద తొలుత చేపట్టిన ప్రధాన లైన్ల అనుసంధాన పనులు మాధవధార వాటర్ ట్యాంకు రోడ్డు వైపు సీతన్న గార్డెన్స్ దగ్గరకు మళ్లించారు. ఆ తరువాత అనుమతి లభించడంతో అక్కడే పైపులను అనుసంధానించి, సీతన్నగార్డెన్స్ దగ్గర ఏర్పాటు చేసిన టి ఆకారం పైపును కాంక్రీటుతో మూసివేసే పనులు చేపడుతున్నారు. ప్రాజెక్టుకు గోపాలపట్నం, నాయుడుతోట ప్రాంతాల్లో పైపుల అమరికకు స్థల వివాదాలు ఏర్పడ్డాయి.
Updated Date - Jun 23 , 2025 | 12:43 AM