మధ్య తరగతికి ఫ్లాట్‌ల నిర్మాణం
ABN, Publish Date - May 07 , 2025 | 12:51 AM
నగరంలో మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో అపార్ట్‌మెంట్లు (ఫ్లాట్లు) నిర్మించాలని వీఎంఆర్‌డీఏ భావిస్తోంది.
వీఎంఆర్‌డీఏ అభిప్రాయ సేకరణ
విశాఖపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి):
నగరంలో మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో అపార్ట్‌మెంట్లు (ఫ్లాట్లు) నిర్మించాలని వీఎంఆర్‌డీఏ భావిస్తోంది. ఎంత విస్తీర్ణంలో ఫ్లాటు అయితే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ ప్రజలను కోరుతున్నారు. ఇవి పూర్తిగా ఎంఐజీ (మధ్య తరగతి ఆదాయ వర్గం) కోసమేనని, అన్నిరకాల సదుపాయాలతో గృహ సముదాయాలు నిర్మిస్తామని, అభిరుచులు, ఆసక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి (వీఎంఆర్డీఏకు చెందిన పర్యాటక ప్రాంతాలు, పార్కులు ఏర్పాటు చేస్తారు) తెలపాలని కోరారు.
12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
జిల్లాలో హాజరుకానున్న విద్యార్థులు 39,992 మంది
66 కేంద్రాల్లో నిర్వహణ
మూడు ఫ్ల్లయింగ్ స్క్వాడ్‌లతో పర్యవేక్షణ
ఆర్‌ఐవో బి.మురళీధర్
మద్దిలపాలెం, మే 6 (ఆంధ్రజ్యోతి):
ఈనెల 12 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.పరీక్షలకు 39,992 మంది హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 32,780 మంది, ద్వితీయ సంవత్సరం 7,212 ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం 66 కేంద్రాలు, ద్వితీయ సంవత్సరానికి 15 కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు సమస్యలు ఏమైనా ఉంటే ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులను 0891-2567561 నంబరులో సంప్రతించవచ్చు.
నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ...
సప్లిమెంటరీ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఆర్‌ఐవో బి.మురళీధర్ తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, కస్టోడియన్స్‌తో సిటింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తాయన్నారు. ఇన్విజిలేటర్లు, విద్యార్థులు ఎలకా్ట్రనిక్ పరికరాలు, ఫోన్లు తీసుకువెళితే చర్యలు తీసుకుంటామన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే కీప్యాడ్ ఫోన్ అనుమతిస్తామన్నారు. కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించడంతో పాటు జిరాక్స్ దుకాణాలు తెరవకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
రైల్వే స్టేషన్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు
ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తున్న 13 దుకాణాలపై కేసులు
విశాఖపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి):
తూనికలు, కొలతల శాఖ అధికారులు మంగళవారం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ కంట్రోలర్ కె.థామస్ రవికుమార్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కంట్రోలర్లు పీడీవీ అప్పలరాజు, ఎస్‌ఎం రాధా కృష్ణ, బి.రామచంద్రయ్య, పి.చిన్నమ్మ, ఇతర సిబ్బంది ప్లాట్‌ఫారాలపై ఉన్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. కూల్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లపై ఐదు నుంచి పది రూపాయలు అదనంగా వసూలుచేస్తున్న 13 దుకాణాలపై కేసులు నమోదుచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కంట్రోలర్ రవికుమార్ మాట్లాడుతూ వినియోగదారులు ప్యాకేజీపై ముద్రించిన ధర మాత్రమే చెల్లించాన్నారు. అదనంగా అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్లు వి.రామారావు, ఎస్.ఉమా సుందరి, డి.అనురాధ ఉన్నారు.
Updated Date - May 07 , 2025 | 12:57 AM