ఆద్యంతం గందరగోళం
ABN, Publish Date - May 02 , 2025 | 01:01 AM
సింహాచలం చందనోత్సవం ఏటా వివాదాస్పదంగా మారుతోంది. ఈ విషయం అందరికీ తెలుసు.
అనుభవం లేని అధికారులతో చందనోత్సవం
ఉత్సవానికి 50 రోజుల ముందే సెలవుపై వెళ్లిన ఈఓ
ఇన్‌చార్జి ఈఓగా సుబ్బారావు నియామకం
చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ బాధ్యతల నుంచి తప్పుకున్న సీనియర్ అధికారి భ్రమరాంబ
మరొకరిని నియమించినా ఎటువంటి బాధ్యతలు అప్పగించని వైనం
ఒకే ఒక సమావేశంతో సరిపెట్టేసిన మంత్రుల కమిటీ
కొండపైనా ఉన్నా ఘటనా స్థలి వద్దకు రాని రెవెన్యూ మంత్రి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సింహాచలం చందనోత్సవం ఏటా వివాదాస్పదంగా మారుతోంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావించి అదే విషయాన్ని దేవదాయ శాఖ పెద్దలకు చెప్పింది. నలుగురు మంత్రులతో కమిటీని వేసింది. అయితే ఇక్కడ ఉత్సవానికి ముందు అనేక మార్పులు, సర్దుబాట్లు జరిగిపోయాయి. ఆలయ ఈఓగా వ్యవహరిస్తున్న త్రినాథ్ అమెరికా వెళతానంటే మూడు నెలలు సెలవు ఇచ్చేశారు. ఆయన ఫిబ్రవరి నెలాఖరున ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. చందనోత్సవం ముందు సెలవు పెడితే ఎలా?...అని ఎవరూ ప్రశ్నించలేదు. ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ స్థానంలో సీనియర్ అధికారిని ఎవరినైనా నియమించారా?...అంటే అదీ లేదు. రెవెన్యూ శాఖలో పనిచేస్తూ రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా పనిచేస్తున్న సుబ్బారావును తీసుకొచ్చి మార్చి ఒకటో తేదీన ఇన్‌చార్జిగా వేశారు. 92 రోజుల తరువాత మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలని ఆయనకు ముందే ఆర్డర్ ఇచ్చారు. మూడు నెలల కాలానికి మనకెందుకులే?...అని ఆయన ఎందులోను తల దూర్చకుండా పైపైన వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఏటా ఈ ఉత్సవానికి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌ను నియమించడం ఆనవాయితీ. ఈసారి అత్యంత సీనియర్, ఇదే ప్రాంతానికి చెందిన భ్రమరాంబను నియమించారు. ఉత్తర్వులు ఇచ్చిన మూడో రోజునే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఆ బాధ్యతలు నిర్వర్తించలేనని తప్పుకున్నారు. దాంతో ద్వారకా తిరుమల ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌మూర్తికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే...గత కొన్నేళ్లుగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌ను నియమిస్తున్నా వారికి ఎటువంటి కీలక బాధ్యతలు అప్పగించడం లేదు. ఉత్సవ విగ్రహంలా ఉంచుతున్నారు. ఈసారీ అదే జరిగింది. ఈ చందనోత్సవంలో సీనియర్ అధికారులు ఎవరైనా ఉన్నారా అంటే...ఇద్దరే కనిపిస్తున్నారు. వారిలో ఒకరు ఇక్కడే అనేక సంవత్సరాలు ఈఓగా పనిచేసి ప్రస్తుతం దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రామచంద్రమోహన్, మరొకరు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు. వారికి ఉత్సవాల నిర్వహణలో అపార అనుభవం ఉంది. కమిషనర్ కూడా గత వారం రోజులుగా ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నారు. ఇంత పెద్ద ఉత్సవాలు ఒకరిద్దరి చేతులు మీదుగా కాకుండా ఎక్కువ మంది బాధ్యతలు పంచుకొని ఉంటే బాగుండేదని, ఈఓ త్రినాథ్‌కు సెలవు ఇవ్వకుండా ఉండాల్సిందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించినా క్షేత్రస్థాయిలో ఉండి చూసుకోవలసింది దేవదాయ శాఖ అధికారులే కావడం వల్ల ఇప్పుడు నింద వారిపైనే పడింది. ప్రభుత్వం నలుగురు మంత్రులతో కమిటీని నియమించింది. వారంతా ఒకసారి సమావేశం నిర్వహించారు. ఆ తరువాత అన్నీ హోం మంత్రి వంగలపూడి అనితే చూసుకున్నారు. ప్రమాద ఘటన జరిగిన తరువాత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటివరకూ కనిపించలేదు. అనగాని సత్యప్రసాద్ స్వామి దర్శనం చేసుకొని వెళ్లిపోయారు. ఎవరూ తమకు పట్టని వ్యవహారంలానే భావించారు. సహాయక చర్యల నుంచి మృతదేహాలకు పోస్టుమార్టం వరకూ హోం మంత్రి అనిత దగ్గరుండి చూసుకున్నారు. భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడపాదడపా వెళ్లి ఏర్పాట్లను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. ఇక ఎంపీ ఎం.శ్రీభరత్‌కు ఈ ఉత్సవ ఏర్పాట్లలో భాగస్వామ్యమే కల్పించలేదు. ఆయన్ను ఏ సమావేశానికీ ఆహ్వానించ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంజనీర్ల ఇష్టారాజ్యం
పనులు తక్కువ...సిబ్బంది ఎక్కువ
సరైన అర్హతలు లేకుండానే పదోన్నతులు
బదిలీపై ఎక్కడికి వెళ్లినా రెండేళ్లలో మళ్లీ ఇక్కడికే రాక
రూ.లక్షల్లో కమీషన్లు
అన్ని పనులకూ రెండు రెట్ల అంచనా వ్యయం పెంపు
‘ప్రసాద్’ పనుల్లో కొన్ని వైసీపీ కార్పొరేటర్‌కు సబ్ లీజు?
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సింహాచలం దేవస్థానంలో ఇంజనీరింగ్ అధికారులు ఆడిందే ఆట...పాడిందే పాట. ఏటా అక్కడ చేపట్టే పనులు ఐదు కోట్ల రూపాయలకు మించవు. అయినా ఆ విభాగంలో పన్నెండు మంది పనిచేస్తున్నారు. నెలనెలా లక్షలాది రూపాయలు జీతాలుగా తీసుకుంటున్నారు. ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇద్దరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, మరో నలుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ముగ్గురు వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఒక క్లర్క్ ఆ విభాగంలో ఉన్నారు. 2018-2023 మధ్య పరిశీలిస్తే ఒక్క ఏడాది కూడా ఐదు కోట్ల రూపాయల విలువైన పనులు చేయలేదు.
‘ప్రసాద్’ పథకం కింద కేంద్రం ఇచ్చిన రూ.54 కోట్లతో ఏపీటీడీసీ పనులు చేయిస్తోంది. వాటిని దేవస్థానం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రెండు వర్గాలు కుమ్మక్కు అయిపోవడం వల్ల వాటిల్లో నాణ్యత లోపించింది. ఇదిలావుంచితే దేవస్థానానికి రవాణా విభాగం కూడా ఉంది. అందులో పనిచేస్తున్న కొందరు ఏవో సర్టిఫికెట్లు పెట్టి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి పొందారు. ఈ విషయం తెలిసి కొందరు దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్, రవాణా విభాగాల్లో ఉద్యోగుల సర్టిఫికెట్లు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అప్పటి కమిషనర్ సత్యనారాయణ స్పందించి ఉద్యోగుల వివరాలన్నీ పంపాలని ఆదేశించారు. వాటిని విజయవాడ కమిషనర్ కార్యాలయానికి పంపించారు. ఈలోగా ఆయన ఆ శాఖ నుంచి బదిలీ అయ్యారు. డిప్యూటీ కమిషనర్ రామచంద్రమోహన్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. నివేదిక చేతిలో ఉన్నా ఎవరిపైనా ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ఒకరు క్లీనర్ స్థాయి నుంచి డీఈఈగా పదోన్నతి పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై వేటు పడుతుందని అనుకున్నారు. కానీ అటువంటిదేమీ లేదు.
ఇక్కడ కీలక స్థానాల్లో ఉన్న అధికారులను వేరే దేవస్థానాలకు బదిలీ చేసినా రెండేళ్లకే తిరిగి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారులు అంతా ఆ కోవకు చెందినవారే. దేవస్థానం టెండర్ల ద్వారా పిలిచే పనులకు అసలు ఖర్చు కంటే రెండు రెట్లు అధికంగా అంచనా వ్యయం రూపొందిస్తారు. వాటిని లెస్‌కు ఇచ్చామంటూ బయటకు చెబుతారు. ఆ పనులు చేయడం వల్ల కాంట్రాక్టర్లకు అన్నీ పోను 30 శాతం మిగులుతుంది. అందుకే ఇక్కడి పనులు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.
అసలు కంటే కొసరు ఎక్కువ
దేవస్థానంలో నిర్మాణాల ద్వారా వచ్చే కమీషన్లు కంటే ఉత్సవాల సమయంలో చేపట్టే పనుల ద్వారా ఇంజనీరింగ్ అధికారులకు బాగా గిట్టుబాటు అవుతుంది. పెండాళ్లు, క్యూలైన్లు, లైటింగ్, ప్రసాదాల తయారీ వంటి పనుల్లో ఎక్కువ మిగులుతుంది. అందుకే ఇక్కడే పనిచేయడానికి వారు ఇష్టపడతారు. తాజాగా నిర్వహించిన చందనోత్సవంలో వీవీఐపీలకు ఏసీ బస్సులు, ఇన్నోవా కార్లు నడుపుతామని టెండర్లు పిలిచి 24 గంటల ముందు నచ్చిన వారికి కాంట్రాక్టు ఇచ్చుకున్నారు. రెగ్యులర్‌గా వాహనాలు సమకూర్చే వారిని కాదని వేరే వారికి అప్పగించారు. ఈ కాంట్రాక్ట్‌లోనే వారికి రూ.లక్షలు మిగిలిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్సవం ద్వారా ఇంజనీరింగ్ విభాగానికే కమీషన్ల రూపంలో రూ.లక్షలు ముట్టాయని ప్రచారం జరుగుతోంది.
ఆ పనుల్లో వైసీపీ కాంట్రాక్టర్
ప్రసాద్ పథకం కింద చేపట్టిన పనులను అనంతరావు అండ్ కో సంస్థ దక్కించుకుంది. కాంట్రాక్టర్ పేరు లక్ష్మణరావు. ఈ పనుల్లో కొన్నింటిని సబ్ లీజుకు ఇచ్చారు. వాటిని వైసీపీ కార్పొరేటర్ ఒకరు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఘటనలో వైసీపీ వారి హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
ల్యాబ్ రిపోర్ట్ లేకుండానే తదుపరి పనులు
కాంట్రాక్టర్లు చేసిన పనులను ఇంజనీరింగ్ అధికారులు శాంపిల్ తీసి లేబరేటరీ టెస్ట్‌కు పంపించాలి. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి పనులు కొనసాగించాలి. కానీ జోడుభద్రాలు వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, మెట్లకు సంబంధించిన నమూనాలు పరీక్షకు పంపలేదు. ఆ తరువాత అక్కడే మరికొన్ని పనులు అదే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఈ వ్యవహారంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Updated Date - May 02 , 2025 | 01:01 AM