సంతలతో చింతలు
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:38 PM
మండలంలోని ప్రధాన రహదారిని ఆనుకుని నిర్వహిస్తున్న వారపు సంతలతో వాహనదారులు విసుగు చెందుతున్నారు. గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుంటూ అవస్థలు పడుతున్నారు.
కాశీపట్నం, డముకు, అనంతగిరి ప్రధాన సంతలతో ట్రాఫిక్ సమస్య
ప్రధాన రహదారికి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేస్తుండడంతో ఇబ్బందులు
గంటల కొద్దీ నిలిచిపోతున్న వాహనాలు
పర్యాటకులకు తప్పని అవస్థలు
వారపు సంత స్థలాలను మార్చాలని వాహనదారుల వేడుకోలు
అనంతగిరి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రధాన రహదారిని ఆనుకుని నిర్వహిస్తున్న వారపు సంతలతో వాహనదారులు విసుగు చెందుతున్నారు. గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుంటూ అవస్థలు పడుతున్నారు.
అరకు-విశాఖ ప్రధాన రహదారిని ఆనుకుని సోమవారం అనంతగిరి మండల కేంద్రంలో, అలాగే బుధవారం కాశీపట్నం, డముకు వద్ద వారపు సంతలు జరుగుతుంటాయి. అయితే రోడ్లపై వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయాలు జరుపుతుండడంతో వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పర్యాటకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించకపోవడం, దుకాణాదారులు ఇష్టారాజ్యంగా రోడ్లపై దుకాణాలను ఏర్పాటు చేసుకోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధాన రహదారి కావడంతో ఇటుగా వెళ్లే వాహనాలు అదుపుతప్పితే పెను ప్రమాదం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌శాఖ ట్రాఫిక్ నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ రోడ్లపై సంతలు కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది.
సంత షెడ్లు ఉన్నా నిరుపయోగం
అనంతగిరి, కాశీపట్నం, వద్ద సంత షెడ్లు ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారాయి. దుకాణదారులు రోడ్లపై స్టాల్స్‌ను ఏర్పాటుచేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. డముకు వద్ద సంత షెడ్లు అంతంతమాత్రంగానే ఉండడంతో అరకు-విశాఖ ప్రధాన రహదారితో పాటుగా డముకు- నిమ్మలపాడు వెళ్లే మార్గమధ్యంలో సంతను నిర్వహిస్తుండడంతో గంటలకొద్దీ వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి దుకాణాదారులకు హెచ్చరికలు జారీచేసి, అనువైన స్థలానికి సంత మార్పు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Jul 07 , 2025 | 11:38 PM