బొగ్గు లారీ బీభత్సం
ABN, Publish Date - Jun 04 , 2025 | 01:09 AM
జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలిలో మంగళవారం ఉదయం బొగ్గు లోడుతో వెళుతున్న లారీ బీభత్సం సృష్టించింది.
కారు, ఆటోను ఢీకొనడంతో నలుగురికి గాయాలు
డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం
లంకెలపాలెం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలిలో మంగళవారం ఉదయం బొగ్గు లోడుతో వెళుతున్న లారీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు, మరో ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలావున్నాయి.
గంగవరం పోర్టులో బోగ్గును లోడ్ చేసుకున్న లారీ అచ్యుతాపురం బయలుదేరింది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో లంకెలపాలెం కూడలి వద్దకు చేరిన లారీ.. ఫ్రీ లెఫ్ట్‌కు వెళ్లాలి. కానీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా నేరుగా వెళ్లి ముందు వెళుతున్న కారును, అనకాపల్లి నుంచి వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా డివైడర్‌పైన వున్న సిగ్నల్ లైట్లు, హైమాస్ట్ స్తంభాన్ని ఢీకొన్ని రెయిలింగ్ పైకి దూసుకుపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎన్.ఆదిలక్ష్మి, జి.దేముడమ్మ, ఎన్.నూకాలమ్మ, డొంకాడకు చెందిన ఆటో డ్రైవర్ సీతారాములకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అగనంపూడి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదిలక్ష్మికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. జనసంచారం లేని సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం వాటిల్లలేదని, అదే మరో రెండు గంటల తరువాత జరిగి వుంటే పరిస్థితి మరోలా వుండేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రేన్‌ను రప్పించి లారీని పక్కకు తీయించారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jun 04 , 2025 | 01:09 AM