సమాధుల స్థలం కబ్జాపై రగడ
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:45 AM
పట్టణంలో బ్రిటీష్ సైనిక అధికారుల సమాధుల స్థలం కబ్జా, ఆక్రమ నిర్మాణాలపై వైస్ చైర్మన్లు, టీడీపీ కౌన్సిలర్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దుకాణాల నిర్మాణాలను అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని వైసీపీకి చెందిన వైస్‌చైర్మన్లు ప్రశ్నించారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుందని, న్యాయస్థానం జారీ చేసే తుది ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మునిసిపల్ కమిషనర్ వివరణ ఇచ్చారు.
మునిసిపల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్, వైస్‌చైర్మన్ వాగ్వాదం
అంశం కోర్టు పరిధిలో ఉందన్న కమిషనర్
అభివృద్ధి పనులకు రూ.5 కోట్ల వీఎంఆర్‌డీఏ నిధులు మంజూరయ్యాయని కౌన్సిలర్ చింతకాయల పద్మావతి వెల్లడి
నర్సీపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో బ్రిటీష్ సైనిక అధికారుల సమాధుల స్థలం కబ్జా, ఆక్రమ నిర్మాణాలపై వైస్ చైర్మన్లు, టీడీపీ కౌన్సిలర్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దుకాణాల నిర్మాణాలను అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని వైసీపీకి చెందిన వైస్‌చైర్మన్లు ప్రశ్నించారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుందని, న్యాయస్థానం జారీ చేసే తుది ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మునిసిపల్ కమిషనర్ వివరణ ఇచ్చారు.
చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన గురువారం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. తొలుత టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నర్సీపట్నం మునిసిపాలిటీ రాష్ట్ర స్థాయిలో 30వ ర్యాంకు, ఓడీఎఫ్ ప్లస్‌కు ఎంపిక కావడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంకు సాధించాలని ఆకాంక్షించారు. మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకువీఎంఆర్‌డీఏ నుంచి రూ.5 కోట్లు మంజూరుకు కృషి చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారాయణకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తర్వాత వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ, పట్టణంలో మెయిన్ రోడ్డుని ఆనుకొని ఉన్న బ్రిటీష్ సైనిక అధికారుల సమాధుల స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిని ఎందుకు అడ్డుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి జోక్యం చేసుకుంటూ.. షాపుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారా అని టీపీవో సత్యనారాయణను ప్రశ్నించారు. ప్లాన్ అనుమతులు ఇవ్వలేదని ఆయన బదులిచ్చారు. మునిసిపల్ కమిషనర్ సురేంద్ర మాట్లాడుతూ, గత వారం స్థలం చుట్టూ పరదాలు కట్టగా, సిబ్బందిని పంపించి తొలగించామని చెప్పారు. దుకాణాలు నిర్మించుకుంటున్న ఐదుగురు వ్యక్తులు గత సోమవారం మధ్యాహ్నం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారని, వాటి జోలికి వెళ్లవద్దని కోర్టు ఆదేశించిందని తెలిపారు. షాపుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా కోర్టుకు తెలియజేశామని అన్నారు. న్యాయస్థానం నుంచి తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 24వ వార్డు కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు మాట్లాడుతూ, మెయిన్ రోడ్డును వంద అడుగులకు విస్తరిస్తామని చెప్పి గత ప్రభుత్వం షాపులు పడగొట్టి పేదల పొట్టకొట్టిందని విమర్శించారు. అక్కడ 19 సెంట్లు స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదని, 2010లో రెవెన్యూ అధికారులు సబ్ డివిజన్ చేశారని మ్యాప్ చూపించారు. వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ, సమాధుల కోసం కేటాయించిన స్థలం 46 సెంట్లు అని, అక్రమణలు పోగా మధ్యలో 19 సెంట్ల స్థలం చూపించారని తెలిపారు. మరో వైస్ చైర్మన్ తమరాన నాయుడు మాట్లాడుతూ, ప్లాన్ అనుమతులు లేకుండా అక్కడ షాపులు నిర్మిస్తున్నారని, అదే సామాన్యులు చేస్తే చూస్తూ ఊరుకుంటారా అని అధికారులను ప్రశ్నించారు.
Updated Date - Aug 01 , 2025 | 12:45 AM