ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
ABN, Publish Date - May 26 , 2025 | 12:07 AM
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.
జిల్లాలోని 19 కేంద్రాల్లో రెండు విడతలుగా నిర్వహణ
8,422 మంది అభ్యర్థులకు 4,496 మంది హాజరు
పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్
మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో తీవ్ర ఇబ్బందులకు గురైన దివ్యాంగ అభ్యర్థులు
విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 19 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 8,422 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,496 (53.38 శాతం) మంది హాజరయ్యారు. 3,926 (46.62 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షను రెండు విడతలుగా ఉదయం 9.30 గంటల నుంచి 11.30, మధ్యాహ్నం 2.30 నుంచి సాయ్రంతం 4.30 గంటల వరకు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొన్ని పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ, అక్కయ్యపాలెం కేంద్రీయ విద్యాలయం కేంద్రాలను ఆయన సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరు, అభ్యర్థులకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఆయా కేంద్రాల్లో భద్రత, పర్యవేక్షణ, అభ్యర్థులకు తాగునీరు, విశ్రాంతి ప్రాంతాలు, సూచన బోర్డులు వంటి వాటిని ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఇదిలావుండగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మహిళా డిగ్రీ కాలేజీ కేంద్రంలో వారి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభ్యర్థులు ఇక్కట్లకు గురయ్యారు. వీల్‌చైర్లు సైతం ఏర్పాటు చేయకపోవడంతో కేంద్రాల్లోకి వెళ్లేందుకు దివ్యాంగ అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారికి సహాయాన్ని అందించేందుకు సిబ్బందిని నియమించకపోవడంతో వారంతా అసహనాన్ని వ్యక్తం చేశారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.
===
ఆ పోస్టు భర్తీ ఎప్పుడో!
3 నెలలుగా విమానాశ్రయం డైరెక్టర్ పోస్టు ఖాళీ
మంత్రి ఆదేశాలు ఇచ్చి 6 నెలలవుతున్నా ప్రారంభం కాని ఎయిర్ కార్గో
మందసలో ఎయిర్ కార్గో సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం విమానాశ్రయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. కొత్తగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ విమానాశ్రయ డైరెక్టరుకు పదోన్నతి లభించి మూడు నెలల క్రితం వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ఆ తరువాత వేరే అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారే తప్పా కొత్తగా డైరెక్టరును నియమించలేదు.
విశాఖ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కార్గో సేవలను ప్రారంభించాలని ఇక్కడి పారిశ్రామిక వర్గాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. కరోనాకు ముందు ఓ సంస్థ సేవలందించేది. విమానాశ్రయం పనిచేయని కాలానికి
(రెండేళ్లు) కూడా అద్దె చెల్లించాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆ సంస్థ వెళ్లిపోయింది. అప్పటినుంచి విదేశాలకు విమానాల ద్వారా సరకులు పంపించే అవకాశం లేకుండా పోయింది. విదేశీ విమానాలు కూడా తగ్గిపోయాయి. గతంలో దుబాయ్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, శ్రీలంకకు అంతర్జాతీయ విమానాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కటే సింగపూర్‌కు నడుస్తోంది. వచ్చే నెలలో అబు ధాబీకి కొత్త సర్వీసు రానున్నది. రద్దయిన బ్యాంకాక్, మలేషియా విమానాలను పునరుద్ధరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి ప్రకటించినా అది ఆచరణలోకి రాలేదు. అంతర్జాతీయ సరకు రవాణా సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి విశాఖ ఎంపీ తీసుకువెళితే గత ఏడాది అక్టోబరులోనే ఢిల్లీ అధికారులకు ఫోన్ చేసి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు.
విశాఖ పరిసరాల్లో వందకు పైగా ఫార్మా కంపెనీలు, కేవలం ఎగుమతులు చేసే బ్రాండిక్స్ దుస్తుల కంపెనీ, వజ్రాలు ఎగుమతి చేసే వీఎస్‌ఈజడ్, ఏడాదికి రూ.20 వేల కోట్ల విలువైన రొయ్యలు ఎగుమతి చేసే సీఫుడ్ ఎగుమతిదారులు ఇక్కడ ఉన్నారు. వీరికి అంతర్జాతీయ కార్గో సర్వీసులు లేకపోవడం వల్ల రోడ్డు మార్గాన పంపుతున్నారు. కొన్ని విమాన సంస్థలు ఆక్యుపెన్సీ లేదని సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. వాటికి సరకు రవాణాకు అనుమతి ఇస్తే... ట్రిప్పునకు టన్ను నుంచి 1.5 టన్నుల సరకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. సుమారు 15 నుంచి 20 మంది ప్రయాణికులను తీసుకెళ్లినట్టు అవుతుంది. కొత్త సర్వీసులకు రన్ వే చార్జీలు, పార్కింగ్, రూట్ నేవిగేషన్ చార్జీలలో కొంత రాయితీ ఇస్తే ఉత్సాహంగా ముందుకు వస్తాయి. ఆదాయం సమకూర్చే వాటికి రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు వీటిని కూడా పరిశీలించాల్సి ఉంది.
మందసలో ఎయిర్ కార్గో సెంటర్ ఏర్పాటు
ముందు వచ్చిన చెవులు కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఉత్తరాంధ్రాలో పరిస్థితి. విశాఖలో విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఉండగా నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ కోసం మరో పోర్టును నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఏడాదికి సుమారు వంద మిలియన్ టన్నుల సరకు ఈ పోర్టు ద్వారా రవాణా జరుగుతోంది. ఇక్కడ ఎయిర్ కార్గోకి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ విస్మరించి శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా మూలపేటలో నిర్మిస్తున్న పోర్టుకు అనుబంధంగా పలాస సమీపాన బిమిడిలో ఎయిర్ కార్గో సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ పోర్టుకు బిమిడికి 40 కి.మీ. దూరం ఉంటుంది. దానికి 1,400 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. అన్ని రకాల వసతులున్న విశాఖను వదిలి అసలు విమానాశ్రయమే లేని పలాసలో ఎయిర్ కార్గో సెంటర్ పెడితే ప్రయోజనం ఏమిటో పెద్దలకే తెలియాలి. కొత్తగా వచ్చేవారిని ప్రోత్సహించడానికి దశాబ్దాలుగా నడుస్తున్న విశాఖ విమానాశ్రయాన్ని విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - May 26 , 2025 | 12:07 AM