యోగా వేడుకలకు అడవి బిడ్డలు
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:38 AM
విశాఖపట్నంలో శనివారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుంచి 25 వేల మంది గిరిజన విద్యార్థులు శుక్రవారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన 106 ఆశ్రమ పాఠశాలల నుంచి విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి పంపారు. ప్రతి బస్సులో వ్యాయామ సంచాలకులు, టీచర్లు, సచివాలయాల సిబ్బంది వున్నారు. వీరు శుక్రవారం సాయంత్రానికి విశాఖ చేరుకున్నారు.
ఏజెన్సీ నుంచి 25 వేల మంది విద్యార్థులు పయనం
106 ఆశ్రమ పాఠశాలల నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలింపు
ఏయూ మైదానంలో గిరిజన విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కారాలు
మెచ్చుకున్న మంత్రులు ప్రతాప్‌రావ్ జాదవ్, నారా లోకేశ్
ప్రపంచ రికార్డు సృష్టించిన ఆదివాసీ విద్యార్థులు
పాడేరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో శనివారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుంచి 25 వేల మంది గిరిజన విద్యార్థులు శుక్రవారం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన 106 ఆశ్రమ పాఠశాలల నుంచి విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి పంపారు. ప్రతి బస్సులో వ్యాయామ సంచాలకులు, టీచర్లు, సచివాలయాల సిబ్బంది వున్నారు. వీరు శుక్రవారం సాయంత్రానికి విశాఖ చేరుకున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25 వేల మంది గిరిజన విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆయుష్ శాఖా మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించేలా సూర్య నమస్కారాలను పూర్తిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు సృష్టించిన రికార్డుతో ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు చదువుతోపాటు యోగాలోనూ రాణిస్తున్నారన్నారు. సూర్య నమస్కారాలు కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్‌పీ అమిత్‌బర్దార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శార్యమన్‌పటేల్, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు.. విద్యార్థులు వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 7న అరకులోయలో యోగాగురు పతంజలి శ్రీనివాస్ శిక్షణలో 21 వేల మంది గిరిజన విద్యార్థులు 108 సూర్యనమస్కారాల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సాధించారు. దీంతో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం విశాఖపట్నంలో ప్రత్యేక ప్రదర్శనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని సారథ్యం వహించారు.
Updated Date - Jun 21 , 2025 | 12:38 AM