ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మూడు ముళ్లతో బాల్యం బందీ

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:16 AM

పుస్తకాలతో బడికి వెళ్లాల్సిన ప్రాయంలో పుస్తెలతాడుతో ముడి పెడుతున్నారు. అభంశుభం తెలియని వయస్సులో బాలికలకు మూడు ముళ్ల బంధనం వేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కొన్ని బాల్య వివాహాలు జరిగిపోతుండగా, అధికారులకు అందిన సమాచారం మేరకు మరికొన్నింటిని అడ్డుకుంటున్నారు. 2024 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో 54 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. నర్సీపట్నం, మాకవరపాలెం, కశింకోట మండలాల్లో అధికంగా బాల్య వివాహాలను అడ్డుకున్నారు. నర్సీపట్నం మునిసిపాలిటీ, రూరల్‌ ప్రాంతంలో 12, మాకవరపాలెంలో ఐదు, కశింకోటలో 8 బాల్య వివాహాలు అడ్డుకున్నారు.

నర్సీపట్నంలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న రూరల్‌ సీఐ, ఐసీడీఎస్‌ అధికారులు

- తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో బాల్య వివాహాలు

- గ్రామీణ ప్రాంతాల్లో అధికం

- ఒకే రోజు నాలుగు పెళ్లిళ్లను అడ్డుకున్న అధికారులు

- వలస కూలీలు ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ

- పేదరికం, దగ్గర సంబంధాలే కారణమంటున్న అధికారులు

- బాల్య వివాహాలతో ఆరోగ్యం సమస్యలు తప్పవంటున్న వైద్యులు

నర్సీపట్నం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): పుస్తకాలతో బడికి వెళ్లాల్సిన ప్రాయంలో పుస్తెలతాడుతో ముడి పెడుతున్నారు. అభంశుభం తెలియని వయస్సులో బాలికలకు మూడు ముళ్ల బంధనం వేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కొన్ని బాల్య వివాహాలు జరిగిపోతుండగా, అధికారులకు అందిన సమాచారం మేరకు మరికొన్నింటిని అడ్డుకుంటున్నారు. 2024 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో 54 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. నర్సీపట్నం, మాకవరపాలెం, కశింకోట మండలాల్లో అధికంగా బాల్య వివాహాలను అడ్డుకున్నారు. నర్సీపట్నం మునిసిపాలిటీ, రూరల్‌ ప్రాంతంలో 12, మాకవరపాలెంలో ఐదు, కశింకోటలో 8 బాల్య వివాహాలు అడ్డుకున్నారు.

చిన్న వయస్సు పెళ్లి చేస్తున్నారు...కాపాడలని ఫోన్‌

ఈ నెల 19వ తేదీన నర్సీపట్నం ప్రాంతంలో ఒకేరోజు నాలుగు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. చెట్టుపల్లి గ్రామానికి చెందిన బాలిక పోలీసులకు, ఐసీడీఎస్‌ అధికారులకు ఫోన్‌ చేసి తనకు చిన్న వయస్సులో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, వెంటనే వచ్చి ఆపాలని కోరింది. అప్రమత్తమైన అధికారులు బాలిక ఇచ్చిన చిరునామాకు వెళ్లి వివాహాన్ని అడ్డుకొని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేశారు. అదే రోజు మరో మూడు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వాటిలో నర్సీపట్నం మునిసిపాలిటీ అయ్యన్న కాలనీలో ఇంటర్‌ పాస్‌ అయిన అమ్మాయికి బాల్య వివాహాం చేయాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, ఐసీడీఎస్‌ అధికారులకు అందిన సమాచారంతో పట్టణ పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. చిన్న వయస్సులో ఎందుకు పెళ్లి చేస్తున్నారని అధికారులు నిలదీస్తే.... అమ్మాయి ఇంటర్‌ పరీక్షలు రాసేసిందని, పెళ్లి కొడుకు తల్లికి గుండె జబ్బు ఉండడంతో పెళ్లి చేసేస్తున్నామని సమాధానం ఇచ్చారు. నర్సీపట్నం మండలం గురందొరపాలెంలో 17, 15 సంవత్సరాల బాలికలకు బాల్య వివాహాలు చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేశారు. బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో అధికం

ఉమ్మడి విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ బాల్య వివాహాలన్నీ తల్లిదండ్రుల అనుమతితో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతుండడం గమనార్హం. వీటిపై అధికారులకు సమాచారం తెలిస్తే ఆపుతున్నారు. లేదంటే బాల్య వివాహాలు యథావిధిగా జరిగిపోతున్నాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం ప్రాంతాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. బాల్య వివాహాల నిరోధించడానికి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రత్యేకంగా అధికార యంత్రాంగం పని చేస్తోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, డివిజనల్‌ స్థాయిలో ఆర్డీవో, మండల స్థాయిలో సీడీపీవో, తహసీల్దార్‌, ఎంపీడీవో, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, గ్రామీణ స్థాయిలో వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. అయినా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

అవగాహన లోపంతోనే..

గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. నిరక్షరాస్యత, పేదరికం, దగ్గర సంబంధాలు ప్రధాన కారణంగా చెబుతున్నారు. వచ్చిన సంబంధం పోతే ఆడపిల్లకు పెళ్లి చేయడం కష్టం అన్న భావనతో తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తున్నారు. చదువు ఆపేసి ఇంట్లో ఉంటున్న ఆడ పిల్లలతో తల్లిదండ్రులు అభద్రతా భావానికి గురవుతున్నారన్న విషయాన్ని చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు గుర్తించారు. ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పటి నుంచి ప్రేమ వ్యవహారాల భయం, చుట్టు పక్కల వారు ఏదో అనుకుంటారని, పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుందని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. వలస కూలీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌ రాయవరం ప్రాంతాల్లో ఇతర ప్రాంతాలకు పనికి వెళ్లిపోయే వారు.. ఇంట్లో ఆడ పిల్ల ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా వదిలించుకోవాలని చూస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

బాల్య వివాహాల వలన నష్టాలు ఇవీ...

- బాలికలకు 18 ఏళ్లు నిండకుండా వివాహాలు చేయడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

- రక్తహీనత సమస్య వచ్చి ప్రసవం సమయంలో ఇబ్బంది పడతారు.

- తక్కువ బరువుతో అనారోగ్యంతో పిల్లలు పుట్టడం, అవయవాల ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు ఎక్కువగా సంభవించడం జరుగుతుంది.

- పిల్లలు జన్యుపరమైన సమస్యలతో పుట్టడంతో పాటు పోషక లోపాలతో జన్మిస్తారు.

- చిన్న వయస్సులో వివాహాలు చేయడం వలన దంపతుల మధ్య అవగాహన లోపంతో కుటుంబ కలహాలకు కారణం అవుతుంది.

- మానసిక పరిపక్వత లేక చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేక ఆత్యహత్యలకు ప్రయత్నిస్తారు.

బాల్య వివాహం చేసినట్టు రుజువైతే...

18 ఏళ్ల లోపు బాలికను వివాహం చేసుకొని సంసారం చేస్తే పోక్సో సవరణ చట్టం-2019 సెక్షన్‌ 4(1) ప్రకారం పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది. 16 ఏళ్లలోపు బాలికను వివాహం చేసుకుంటే అత్యాచారం కింద పరిగణించి 20 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది. జీవిత ఖైదు, జరిమానా విధించే అవకాశం ఉంది. బాల్య వివాహాలను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, పెద్దలు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు.

సమాచారం అందించండి ఇలా..

ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే స్థానిక ఐసీడీఎస్‌ సీడీపీవో, తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయి అధికారులకు, చైల్డ్‌ లైన్‌ 1098 టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 100, 181 నంబర్లకు కూడా ఫోన్‌ చేసి చెప్పవచ్చు.

Updated Date - Apr 27 , 2025 | 01:16 AM