నేడు ముఖ్యమంత్రి రాక
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:03 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం నగరానికి వస్తున్నారు.
ఏఎంసీలో సెంటినరీ అలూమ్ని భవనాన్ని ప్రారంభించనున్న చంద్రబాబునాయుడు
సుమారు రూ.50 కోట్ల నిర్మాణం
విశాఖపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం నగరానికి వస్తున్నారు. ఉదయం 10.40 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వెళ్లి...మత్స్యకార భరోసా నిధులు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5.25 గంటలకు బయలుదేరి 5.45 గంటలకు నగరంలోని కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో 5.55 గంటలకు ఆంధ్ర వైద్య కళాశాలకు చేరుకుని, శతాబ్ది ఉత్సవాలకు గుర్తుగా నిర్మించిన సెంటినరీ అలూమ్ని భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వైద్యులతో వివిధ అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 6.55 గంటలకు ఏఎంసీ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7.15 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 7.25 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పూర్వ విద్యార్థుల సహకారంతో రూ.50 కోట్ల వ్యయంతో సెంటినరీ అలూమ్ని భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణానికి నిధులు సమీకరించే కమిటీకి చైర్మన్‌గా ప్రముఖ వైద్యులు డాక్టర్ టి.రవిరాజు వ్యవహరించారు. పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్వంలో దేశ, విదేశాల్లోని సుమారు 300 మంది వైద్యుల ఆర్థిక సహకారంతో నాలుగు అంతస్థుల్లో ఈ భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. సుమారు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవనంలో 600 మంది కూర్చునేలా అధునాతన ఆడిటోరియం ఉంది. ఎల్‌ఈడీ స్ర్కీన్స్‌తో పాటు వైద్య విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. డిజిటల్ లైబ్రరీని కూడా అందుబాటులో ఉంచారు. రీడింగ్ రూమ్స్, లెక్చర్ హాల్స్ ఉన్నాయి. ఏఎంసీ చరిత్రతోపాటు పూర్వ విద్యార్థుల్లో ప్రముఖుల జీవిత విశేషాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ హాల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ భవన నిర్మాణానికి గతంలో ప్రిన్సిపాళ్లుగా పనిచేసిన డాక్టర్ టి.రాధ, డాక్టర్ పీవీ సుధాకర్, డాక్టర్ బుచ్చిరాజు, డాక్టర్ కుమార్ విశేష కృషిచేశారు.
Updated Date - Apr 26 , 2025 | 01:03 AM