ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
ABN, Publish Date - Jun 13 , 2025 | 01:20 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నగర పర్యటన రద్దయ్యింది.
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నగర పర్యటన రద్దయ్యింది. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం నేపథ్యంలో సీఎం తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. ఆయన శుక్రవారం నోవాటెల్ హోటల్‌లో జరిగే రెన్యువబుల్ ఎనర్జీ దక్షిణ భారత సదస్సుకు హాజరు కావలసి ఉంది. అలాగే సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన ‘ది డెక్’ భవనాన్ని, ఆ భవనం ఐదో అంతస్థులో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఆ తరువాత వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే సమావేశంలో పాల్గొని, పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చించాల్సి ఉంది. ఇవన్నీ రద్దయ్యాయి.
పెందుర్తిలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం
రూ.452.46 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి ప్రాంతంలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.452.46 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతుంది. ఈ ప్రాజెక్టును 15 ఏళ్లు నిర్వహిస్తారు. విశాఖపట్నంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా దీనిని ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొన్నారు.
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో 55.39% ఉత్తీర్ణత
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మే 19 నుంచి 28వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో జిల్లా ఉత్తీర్ణత 55.39 శాతంగా నమోదైంది. బాలురు 2,100, బాలికలు 1455 మంది...మొత్తం 3,555 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 1,142 మంది (54.38 శాతం), బాలికలు 827 (56.84 శాతం) వెరసి 1,969 మంది (55.39 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జూన్ 13 నుంచి 19వ తేదీ వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
పాఠశాలలు పునఃప్రారంభం
సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజునే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కూలు కిట్లు పంపిణీ చేశారు. అలాగే ఈ ఏడాది నుంచి యూనిఫామ్ డిజైన్ మార్చారు. దీనికి అనుగుణంగా విద్యార్థులకు మూడు జతలకు అవసరమైన క్లాత్ అందజేశారు. కాగా మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయడంతో టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు. గురువారం సన్న బియ్యంతో తయారుచేసిన ఆహారాన్ని పిల్లలకు వడ్డించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని ఎస్టీయూ జిల్లా కార్యదర్శి, అడవివరం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఇమంది పైడిరాజు అన్నారు.
నగరంలో భారీ వర్షం
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): నగరంలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. తెల్లవారు జాము నాలుగు గంటల నుంచి 6.30 గంటల వరకూ వర్షం కురిసింది. ఏకధాటిగా రెండు గంటలు పడిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్ఞానాపురం, చావులమదుం, ఆర్టీసీ కాంప్లెక్స్, పూర్ణామార్కెట్, ఇసుకతోట తదితర ప్రాంతాల్లో వరదనీరు గెడ్డల నుంచి పైకి వచ్చి రహదారులపై ప్రవహించింది. గాజువాకలో 42.77 మి.మీ., మహారాణిపేటలో 43 మి.మీ., సిద్ధేశ్వరంలో 50.75 మి.మీ., నాతయ్యపాలెంలో 32 మి.మీ. నమోదైంది.
Updated Date - Jun 13 , 2025 | 01:20 AM