కోళ్ల వ్యర్థాల వార్!
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:45 AM
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో కోళ్ల వ్యర్థాల సేకరణ అంశం వివాదాస్పదమవుతోంది.
జీవీఎంసీ పరిధిలో సేకరణ కోసం రెండు వర్గాలుగా విడిపోయిన కార్పొరేటర్లు
గతంలో టెండర్ దక్కించుకున్నవారికి ఒక వర్గం సహకారం
వైసీపీ చోటా నేత చికెన్ వ్యర్థాలు సేకరించుకునేలా మరో వర్గం అండదండలు
ఒకరి వాహనాలను ఒకరు పట్టుకుని అధికారులకు అప్పగిస్తున్న ఇరు వర్గాలు
తాజాగా కోళ్ల వ్యర్థాల వాహనాలను అనకాపల్లి వద్ద అడ్డుకున్న అధికారులు
టీమ్ జీవీఎంసీ వాట్సాప్ గ్రూపులో ఒకరిపై ఒకరు ఆరోపణలతో పోస్టింగులు
క్రిమినల్ కేసులు పెట్టి చికెన్ వ్యర్థాల మాఫియాని ఛేదించాలంటూ మరికొందరు డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో కోళ్ల వ్యర్థాల సేకరణ అంశం వివాదాస్పదమవుతోంది. చికెన్ వ్యర్థాల సేకరణకు జోన్లవారీగా జీవీఎంసీ గతంలో పిలిచిన టెండర్లను అధికారులు నెల రోజులు కిందట రద్దు చేయగా, కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లడంతో స్టే విధించారు. దీంతో గత కాంట్రాక్టర్లు యథావిధిగా చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరిస్తుండగా... మరోవైపు వైసీపీకి చెందిన చోటా నేత పేరుతో కొందరు కోళ్ల వ్యర్థాలను వాహనాలతో సేకరించడం ఆరంభించారు. వీరంతా చికెన్ వ్యర్థాలను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు కాకుండా చేపల చెరువులకు తరలిస్తుండడంతో ఒకరి వాహనాలను మరొకరు పట్టుకుని అధికారులకు అప్పగిస్తున్నారు. ఇందుకు వైసీపీ, టీడీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు సహకరిస్తున్నారంటూ ‘టీమ్ జీవీఎంసీ’ వాట్సాప్ గ్రూపులో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటుండడంతో కార్పొరేటర్ల మధ్య సవాళ్లు తారస్థాయికి చేరాయి.
జీవీఎంసీ పరిధిలోని చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించి వాటిని కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలించి, అక్కడ భూమిలో పాతిపెట్టడానికి జీవీఎంసీ ఏడాది కిందట జోన్లవారీగా టెండర్లు పిలిచింది. అయితే చికెన్ వ్యర్థాలకు చేపల చెరువుల నిర్వాహకుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. చికెన్ వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తే వేగంగా పెరగడంతోపాటు బరువు కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో చికెన్ వ్యర్థాల కోసం చేపల పెంపకందారులు పోటీ పడుతుంటారు. అందువల్ల చాలామంది చికెన్ వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చేపల చెరువులకు తరలిస్తుంటారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది కాబట్టి చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు తరలించే వాహనాలపై అధికారులు కేసులు నమోదు చేస్తుంటారు. కానీ చికెన్ వ్యర్థాల సేకరణ టెండర్లు దక్కించుకునేవారి వెనుక టీడీపీ, వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ఉండడంతో అధికారులు చేష్టలూడిపోతుంటారు.
గత ఏడాది చికెన్ వ్యర్థాల కోసం పిలిచిన టెండర్లలో కూడా కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు జోక్యం చేసుకుని తమ అస్మదీయులకు టెండర్లు దక్కేలా అధికారులపై ఒత్తిడి చేయడం పరిస్థితికి అద్దంపట్టినట్టయింది. కూటమి నేతల అండదండలతోపాటు వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు అండదండలతో టెండర్లు తమ చేజారిపోయాయనే బాధలో ఉన్న ఆశావహులు కొందరు చికెన్ వ్యర్థాల తరలింపు నిబంధనల ప్రకారమే జరిగేలా చూడాలని భావించారు. ఇందులో భాగంగా డంపింగ్ యార్డుకు కాకుండా చేపల చెరువులకు వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలను పట్టుకుని జీవీఎంసీ, పోలీస్ అధికారులకు అప్పగించడం మొదలుపెట్టారు. పట్టుబడిన వాహనాలను విడిచిపెట్టాలంటూ కూటమికి చెందిన నేతలే అధికారులపై ఒత్తిడి చేస్తుండడంతో అధికారులు డైలామాలో పడుతున్నారు. అయినప్పటికీ పదేపదే చేపల చెరువులకు వెళుతున్న కోళ్ల వ్యర్థాల వాహనాలను పట్టుకుని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండడంతో జీవీఎంసీ అధికారులు నెల రోజులు కిందట చికెన్ వ్యర్థాల కోసం గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేశారు. దీనిపై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లడంతో జీవీఎంసీ అధికారుల ఆదేశాలపై స్టే విధించింది.
పాత కాంట్రాక్టర్లే యథావిధిగా..
టెండర్లను రద్దు చేస్తూ జీవీఎంసీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించడంతో పాత కాంట్రాక్టర్లే యథావిధిగా తమ జోన్ల పరిధిలో కోళ్ల వ్యర్థాలను సేకరిస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి చెందిన చోటా నేత పేరుతో కొందరు వాహనాలను పెట్టుకుని కొన్ని వార్డుల పరిధిలో చికెన్ వ్యర్థాలను సేకరించి, చేపల చెరువులకు తరలించడం ఆరంభించారు. ఇందుకోసం కొందరు కార్పొరేటర్లతోపాటు జీవీఎంసీ అధికారులను కూడా తమకు సహకరించేలా ప్రసన్నం చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు నిఘా పెట్టి కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు తరలించే వాహనాలను పట్టుకుని సమీపంలోని పోలీస్, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.
ఇందులో భాగంగానే వారం రోజులు కిందట గాజువాకలో అనధికారికంగా చికెన్ వ్యర్థాలను సేకరించి అనకాపల్లి వైపు వెళుతున్న వాహనాన్ని కొందరు పట్టుకుని గాజువాక డంపింగ్ యార్డులో పెట్టి జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆ వాహనాన్ని ఎవరో అక్కడి నుంచి తరలించుకుపోయారు. దీంతో ఆ వాహనాన్ని పట్టుకుని యార్డులో పెట్టినవారు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంతో మూడు రోజుల తరువాత సంబంధిత వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ కేసు నమోదు చేశారు. దీంతో మరో వర్గం కోళ్ల వ్యర్థాల సేకరణదారులు తమ వైరివర్గం వాహనాలను శనివారం రాత్రి అనకాపల్లి వద్ద పట్టుకుని ఆ జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అనకాపల్లి తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది మూడు వాహనాలను పట్టుకుని జీవీఎంసీ అధికారులకు అప్పగించగా, వాటిని కాపులుప్పాడ డంపింగ్ యార్డులో ఉంచారు. ఆదివారం ఉదయం మరో రెండు వాహనాలను అనకాపల్లిలో రెవెన్యూ అధికారులు పట్టుకుని జీవీఎంసీ అధికారులకు అప్పగించడంతో వివాదం రాజుకుంది. దీనివెనుక కొందరు కార్పొరేటర్లు హస్తం ఉందని వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తూ ‘టీమ్ జీవీఎంసీ’ వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టగా, కాదు.. ‘మీరే కోళ్ల వ్యర్థాల మాఫియాకు అండదండలు అందిస్తున్నారు’ అంటూ మరో వర్గం ఆరోపణలు గుప్పించుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు కార్పొరేటర్లు అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, పట్టుబడిన వాహనాలు ఎవరివనే దానితో పాటు దాని వెనుక ఎవరు ఉన్నారనేది కూడా తేల్చేలా పోలీస్ దర్యాపునకు ఆదేశించాలంటూ జీవీఎంసీ కమిషనర్‌ను కోరుతూ అదే గ్రూపులో పోస్టింగ్‌లు పెట్టి సవాల్ చేశారు. ఏదిఏమైనా కోళ్ల వ్యర్థాల వ్యవహరం కార్పొరేటర్ల మధ్య వివాదానికి కారణంగా మారడం చర్చనీయాంశంగామారింది. దీనిపై జీవీఎంసీ చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ కిశోర్‌కుమార్ వద్ద ప్రస్తావించగా... ఐదు వాహనాలు తమ ఆధీనంలో ఉన్నాయని, వీటిపై సోమవారం పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
Updated Date - Jul 14 , 2025 | 12:45 AM