ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్
ABN, Publish Date - May 24 , 2025 | 11:06 PM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలులో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసి, మరింత పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించే నిధుల ఖర్చు విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
యుక్త్‌ధార యాప్‌తో పనుల పర్యవేక్షణ
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలులో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసి, మరింత పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించే నిధుల ఖర్చు విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమాలు అరికట్టి పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యుక్త్‌ధార యాప్‌ను తీసుకొచ్చింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే పనుల గుర్తింపు దగ్గర నుంచి పనులకు వచ్చే శ్రామికుల వివరాలు, బిల్లుల చెల్లింపులు అన్ని వ్యవహారాలు ఈ యాప్ ద్వారానే జరగనున్నాయి.
ఉపాధి పనులను జియోట్యాగ్ ద్వారా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పనులకు వచ్చే శ్రామికుల వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. జియో ట్యాగ్ చేసిన పనుల వద్ద మాత్రమే శ్రామికులు పనులు చేయాల్సి ఉంటుంది. శ్రామికులు పనులు చేస్తున్నట్టు ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతి పాటించడం వల్ల రాష్ట్రంలో ఏ మారుమూల మండలం, గ్రామంలో జరిగే ఉపాధి పనులనైనా యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. యాప్‌లో అన్ని వివరాలు నమోదు చేయడం వల్ల అవకతవకలకు అవకాశం ఉండదు. అలాగే శ్రామికులకు సకాలంలో వేతనాలు విడుదల అవుతాయి. జిల్లాలోని 24 మండలాల్లో 645 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ పథకంలో పనిచేసేందుకు జిల్లాలో 2.93 లక్షల మంది శ్రామికులు నమోదయ్యారు. వీరిలో 2.81 లక్షల మందికి జాబ్ కార్డులు జారీ చేశారు.
గ్రామస్థాయిలో ప్రణాళికలు సులభతరం
యుక్త్‌ధార యాప్ వినియోగం ద్వారా గ్రామ స్థాయిలో ఉపాధి పనుల ప్రణాళికలు రూపొందించడం మరింత సులభతరం అవుతుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ యాప్‌ను వినియోగిస్తూ ఒక పంచాయతీలో పనులు చేపడుతున్నామన్నారు. యాప్‌పై అవగాహన కల్పించేందుకు ఉపాధి హామీ మండల, గ్రామ స్థాయి సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అన్ని మండలాల్లో యుక్త్‌ధార యాప్‌ను వినియోగించడం ద్వారా ఉపాధి పనుల గుర్తింపు, చెల్లింపులు జరుపుతామని తెలిపారు.
Updated Date - May 24 , 2025 | 11:06 PM