పకడ్బందీగా చందనోత్సవం
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:51 AM
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవంలో సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని దేవదాయఽశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సింహాచలం గోశాల సమీప శ్రీనివాసనగర్‌లోని దేవస్థానం నూతన కల్యాణ మండపంలో బుధవారం చందనోత్సవ ఏర్పాట్లపై అన్నిశాఖల అఽధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఉన్నత సదుపాయాలు కల్పించి ఆధ్యాత్మికాంద్రప్రదేశ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యానికి అనుగుణంగా అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలు, తప్పిదాలపై కూలంకుషంగా అన్ని విభాగాల అధికారులతో చర్చించి, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
గత తప్పిదాలు పునరావృతం కాకూడదు
అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి
దేవదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేయాలి: హోం మంత్రి అనిత
దైవభక్తి ఉన్న అధికారులనే ఉత్సవానికి నియమించాలి: ఎమ్మెల్యే వెలగపూడి
నకిలీ టికెట్లు లేకుండా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే పల్లా
సామాన్య భక్తులకు సమస్యల్లేకుండా చూడాలి: ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు
క్యూఆర్‌కోడ్, హోలోగ్రామ్‌తో టికెట్లు, పాస్‌ల జారీ: కలెక్టర్ హరేంధిర ప్రసాద్
ఉదయం 5 గంటలలోగా వీఐపీలకు అంతరాలయ దర్శనం
సింహాచలంలో అప్పన్న చందనోత్సవంపై సమీక్ష సమావేశం
వేపగుంట, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవంలో సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని దేవదాయఽశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సింహాచలం గోశాల సమీప శ్రీనివాసనగర్‌లోని దేవస్థానం నూతన కల్యాణ మండపంలో బుధవారం చందనోత్సవ ఏర్పాట్లపై అన్నిశాఖల అఽధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఉన్నత సదుపాయాలు కల్పించి ఆధ్యాత్మికాంద్రప్రదేశ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యానికి అనుగుణంగా అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలు, తప్పిదాలపై కూలంకుషంగా అన్ని విభాగాల అధికారులతో చర్చించి, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ వీవీఐపీ, ప్రొటోకాల్ టికెట్ల నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించేందుకు రూ.1,500 టిక్కెట్లును కేవలం 2,500 మత్రమే ముద్రించామన్నారు. వాటిలో క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు వీలుగా అంబులెన్స్‌లు వారి వద్దకు చేరేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొండమార్గంలో వాహనాలు ఆగిపోతే వాటిని వెంటనే తరలించేందుకు క్రేన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా ఆశాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇబ్బందులు ఎదురైతే జనరేటర్‌తో విద్యుత్ సరఫరా చేసేలా ఆదేశాలు జారీచేశామన్నారు. కొండపైకి భక్తులను తరలించేందుకు వీలుగా పూర్తి ఫిట్‌నెస్ ఉన్న బస్సులను మాత్రమే వినియోగించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ కొండపైకి ఎక్కువ వాహనాలను అనుమతించకూడదని, జ్యుడీషియరీ, రెవెన్యూ, దేవస్ణానం విభాగాల నుంచి ఒక్కో ఉద్యోగిని ప్రవేశమార్గంలో ఉంచితే వారు వీఐపీలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. వీఐపీతో పాటు వచ్చే కుటుంబసభ్యుల్లో ఆరుగురిని మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ క్యూలైన్ మధ్యహాల్డింగ్ బ్లాక్ ఏరియా ఏర్పాటుచేసి, రద్దీకి అనుగుణంగా భక్తులను నిలిపి ఉంచి, రద్దీ తగ్గిన తరువాత క్యూలైన్‌లో కలిపేందుకు రోప్ పార్టీల సాయంతో విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని, దానిని ఇక్కడా అమలు చేయాలన్నారు. తెల్లవారుజామును ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దర్శనం ఆనంతరం మూడు గంటల నుంచి సామన్య భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. అదే సమయంలో వీవీఐపీలు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉదయం 5 గంటల్లోగానే అంతరాలయాల దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రూ.1,500 టికెట్ తీసుకున్న అధికారులు, మంత్రులకు అనివార్య కారణాల వల్ల ఉదయం రాలేకపోతే సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తామన్నారు. చందనోత్సవానికి లక్షమంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి భక్తుడు దర్శనం చేసుకుని, బయటకు రాగానే పులిహోర, దద్దోజనం, లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించాలని, నిత్యాన్నదానం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్, వీల్‌చైర్స్ ఏర్పాటుచేయాలన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ క్యూలైన్ పరిధి పెంచడంతో పాటు సదుపాయాల కల్పనపైనా దృష్టి సారించాలన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో రూ.1,500 టికెట్లను మా బంధువులకు ఇచ్చి, దర్శనానికి పంపిస్తే అవి నకిలీవిగా తేలిందని, ఈ సారి అలాంటి పొరపాట్లు దొర్లకుండా ప్రవేశమార్గంలోనే టికెట్లు పరిశీలించేలా చూడాలన్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపుడి రామకృష్ణబాబు మాట్లాడుతూ సామన్య భక్తులకు సంతృప్తిగా దర్శనమయ్యేలా చూడాలన్నారు. ముఖ్యంగా పోలీసు, దేవదాయశాఖలో దైవభక్తి ఉన్న ఉద్యోగులను మాత్రమే వీఐపీ మార్గంలో ఉంచాలన్నారు. దురుసుగా ప్రవర్తించేవారిని ఎట్టి పరిస్థితుల్లో నియమించవద్దని, అధికారులు తమ బంధువులు, సిబ్బందిని క్యూలైన్ల మధ్యలోకి పంపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రొటోకాల్ కారణంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త పుసపాటి అశోకగజపతిరాజు మాట్లాడుతూ సామన్య భక్తులకు సత్వరం దర్శనం లభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆగమశాస్త్ర నిపుణలను సంప్రదించి వారు ఏ సమయానికి రమ్మంటే అదేసమయానికి తాను దర్శనానికి వస్తానన్నారు. దేవదాయశాఖ కమిషనర్ కోడూరి రామచంద్రమోహన్ మాట్లాడుతూ భక్తుల క్యూలైన్ మోనటరింగ్, ఎంత సమయానికి ఎంత మంది భక్తులు దర్శించుకున్నారనే వివరాలు, ప్రత్యేక బారికేడ్లు, తదితర చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వినయ్‌చంద్ మాట్లాడుతూ మల్లిపుల్ క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సింహాచలం ఇన్‌చార్జి ఈవో సుబ్బారావు మాట్లాడుతూ క్యూలైన్ పొడువు పెంచుతామని వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, విష్ణుకుమార్‌రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:51 AM