నైట్ ఫుడ్ కోర్టుపై పిల్లిమొగ్గలు
ABN, Publish Date - May 09 , 2025 | 01:27 AM
జీవీఎంసీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్నామనే సంతోషంలో ఉన్న కూటమి కార్పొరేటర్లలో నైట్ ఫుడ్ కోర్ట్ వ్యవహారం కల్లోలం రేపుతోంది.
వైసీపీ నేతల ప్రోద్బలంతో పాత జైలురోడ్డులో అనధికారికంగా దుకాణాల ఏర్పాటు
కొంతమందికి పదేసి దుకాణాలు...
రోజుకు ఒక్కో దుకాణం నుంచి రూ.300 వరకూ మామూళ్లు వసూలు
అక్కడి నుంచి తొలగించాలని గతంలో కూటమి కార్పొరేటర్ల పట్టు
లేనిపక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించిన కార్పొరేటర్లు
ఇప్పుడు ఫుడ్‌కోర్ట్ తొలగింపునకు కొంతమంది కార్పొరేటర్ల ససేమిరా
ప్రస్తుతం ఉన్న దుకాణాలను తొలగించి, అవసరమైతే అదే ప్రాంతంలో జీవీఎంసీకి ఆదాయం వచ్చేలా,
అర్హులైన వారికి డ్రా లేదా వేలం ద్వారా దుకాణాలు కేటాయించాలని మరికొందరి వాదన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్నామనే సంతోషంలో ఉన్న కూటమి కార్పొరేటర్లలో నైట్ ఫుడ్ కోర్ట్ వ్యవహారం కల్లోలం రేపుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పాత జైలురోడ్డులో నడుస్తున్న ఫుడ్ కోర్ట్‌ను తొలగించాలని టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాల కార్పొరేటర్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. వైసీపీ హయాంలో కౌన్సిల్‌లో కీలకంగా వ్యవహరించిన పెద్దలకు నెలవారీ వాటాలు అందడంతో వారంతా ఫుడ్ కోర్ట్ తొలగింపునకు మోకాలడ్డారు. ఈ నేపథ్యంలో తక్షణం ఫుడ్‌కోర్ట్‌ని తొలగించకపోతే ధర్నా చేస్తామంటూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు నాలుగు నెలల కిందట అధికారులకు అల్టిమేటం జారీచేశారు. కానీ మేయర్ పీఠం కూటమి హస్తగతం చేసుకున్న తర్వాత పరిస్థితి చూస్తే...ఫుడ్‌కోర్ట్ తొలగించాలని ఒక వర్గం పట్టుబడుతుండగా, మరొకవర్గం ససేమిరా అంటోంది.
పర్యాటకులతోపాటు నగరవాసులకు కూడా రాత్రివేళ ఆహారం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో పాత జైలురోడ్డులో ఫుడ్‌కోర్ట్ ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కేవలం 32 దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఒక్కో దుకాణం ప్రతి నెలా జీవీఎంసీకి అద్దె చెల్లించేలా, ఆ మేరకు ఫుడ్‌కోర్ట్ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యత నగర పాలక సంస్థ చూసుకునేలా ఆదేశాలు జారీచేశారు. కరోనా కారణంగా ఫుడ్‌కోర్ట్‌ను మూసివేసేశారు. తర్వాత తిరిగి ప్రారంభించేందుకు వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నా...పారిశుధ్య సమస్య, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి కారణాలతో జీవీఎంసీ అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ వైసీపీ నేతల ప్రోద్బలం, జీవీఎంసీ కౌన్సిల్‌లో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ కార్పొరేటర్లు కొందరి అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే ఫుడ్‌కోర్ట్‌ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఫుడ్‌కోర్ట్‌లో 170కి పైగా దుకాణాలు ఉన్నాయి. నలుగురైదుగురు వ్యక్తులు పదేసి దుకాణాలను ఏర్పాటుచేసి, వాటిని అద్దెకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నారు. దుకాణదారుల నుంచి ప్రతిరోజూ రూ.300 నుంచి రూ.500 వసూలు చేసి ఫుడ్‌కోర్ట్‌కు అండదండలు అందించిన నేతలకు, సంబంధిత కార్పొరేటర్లకు వాటాలు ఇచ్చే బాధ్యతను ఒక వ్యాపారి తీసుకున్నారు. జీవీఎంసీకి ఫుడ్‌కోర్ట్ వల్ల ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా సరే పారిశుధ్య సిబ్బందితోనే అక్కడ పనులు చేయించేవారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన కార్పొరేటర్లు పెద్దఎత్తున ఆరోపణలు గుప్పించారు. జీవీఎంసీకి ఆదాయం రాని అనధికార ఫుడ్‌కోర్ట్‌ను అక్కడి నుంచి తొలగించాలంటూ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేసేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫుడ్‌కోర్ట్‌ను అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. తర్వాత దీనిని అమలు చేయకుండా తాత్సారం చేయడంతో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఫుడ్‌కోర్ట్‌ను పూర్తిగా తొలగించాలని, లేనిపక్షంలో వారం తర్వాత అక్కడే ధర్నాకు దిగుతామంటూ అల్టిమేటం జారీచేశారు. దీంతో అధికారులు ఫుడ్‌కోర్ట్‌ను అక్కడి నుంచి తొలగించేందుకు కసరత్తు ప్రారంభించారు.
ఫుడ్‌కోర్ట్‌ను తొలగించేందుకు అధికారులు సన్నద్ధం కాగా ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లకు వాటాలుగా పంచే బాధ్యత చూస్తున్న దళారి రంగంలోకి దిగాడు. కూటమిలో కొందరు ప్రజాప్రతినిధులతోపాటు కార్పొరేటర్లలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిని ప్రసన్నం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఫుడ్‌కోర్ట్ తొలగింపు విషయంలో తొందరపడొద్దంటూ అధికారులకు ఆదేశాలు అందాయి. ఫుడ్‌కోర్ట్‌ను తొలగించాలని చాలాకాలంగా పోరాటం చేస్తున్నామని, ఇప్పుడు వెనక్కి తగ్గితే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందని కూటమిలో కొంతమంది కార్పొరేటర్లు అంటున్నారు. మేయర్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత గత పాలకవర్గం చేసిన తప్పిదాలను సరిదిద్దడం ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించుకోవాల్సిన సమయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని ఫుడ్‌కోర్ట్ తొలగింపునకు అడ్డుపడుతున్న కార్పొరేటర్లకు చెబుతున్నారు. ఫుడ్ కోర్టులో ప్రస్తుతం ఉన్న దుకాణాలను తొలగించాలని, అవసరమైతే తిరిగి అదేచోట జీవీఎంసీకి ఆదాయం వచ్చేలా అర్హులైన వారికి డ్రా లేదా వేలం ద్వారా దుకాణాలను కేటాయించాలని సూచిస్తున్నారు. కూటమి కార్పొరేటర్లలోనే భిన్న వాదనలు మొదలవ్వడంతో ఫుడ్ కోర్ట్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆసక్తిగా మారింది.
Updated Date - May 09 , 2025 | 01:27 AM