ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీఎన్‌ రోడ్డు దుస్థితిపై కోర్టులో కేసు

ABN, Publish Date - Jul 07 , 2025 | 11:28 PM

జిల్లాలోని బీఎన్‌ (భీమిలి-నర్సీపట్నం) రోడ్డు దుస్థితిపై కలెక్టర్‌ సహా ఏడుగురు ప్రభుత్వ అధికారులకు లీగల్‌సెల్‌ అథారిటీ చైర్మన్‌, తొమ్మిదో అదనపు కోర్టు న్యాయాధికారి నోటీసులు జారీచేశారు.

కోర్టు వద్ద వివరాలు వెల్లడిస్తున్న న్యాయవాది డేవిడ్‌

జిల్లా కలెక్టర్‌, ఆర్‌డీవో సహా ఏడుగురు ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ

26న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశం

పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాదులు

చోడవరం, జూలై 7 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని బీఎన్‌ (భీమిలి-నర్సీపట్నం) రోడ్డు దుస్థితిపై కలెక్టర్‌ సహా ఏడుగురు ప్రభుత్వ అధికారులకు లీగల్‌సెల్‌ అథారిటీ చైర్మన్‌, తొమ్మిదో అదనపు కోర్టు న్యాయాధికారి నోటీసులు జారీచేశారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతో పాటు, అల్లూరి జిల్లా ప్రజలకు కీలకమైన బీఎన్‌ రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగంపై లీగల్‌ సెల్‌లో బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్‌ ఆధ్వర్యంలో మరో ఇద్దరు న్యాయవాదులు భరత్‌భూషణ్‌, భూపతిరాజులు పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ పిల్‌ను దాఖలు చేశారు. న్యాయవాదుల పిటిషన్‌పై స్పందించిన లీగల్‌ సెల్‌ అథారిటీ చైర్మన్‌, తొమ్మిదో అదనపు కోర్టు న్యాయాధికారి ఎ.రతన్‌కుమార్‌...రహదారుల పరిస్థితికి బాధ్యులైన అధికారులు ఈనెల 26న కోర్టు ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్టు న్యాయవాది కాండ్రేగుల డేవిడ్‌ సోమవారం ఉదయం విలేకరులకు వెల్లడించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ప్రధానమైన చోడవరం బీఎన్‌ రోడ్డుతో పాటు, మాడుగుల రోడ్డు నిర్వహణను గత 20 ఏళ్లుగా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాల పాలవుతున్నారని, వాహనాల యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారన్న విషయాన్ని తమ పిటిషన్‌లో కోర్టు ముందుంచామన్నారు. ఈ రోడ్డు వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు...ఇలా అన్నివర్గాల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సెక్షన్‌ 12, 13 ప్రకారం లీగల్‌సెల్‌ కోర్టులో కేసు దాఖలు చేసినట్టు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం కల్పించవలసిన ప్రాథమిక వసతుల కల్పనలో వైఫల్యం గుర్తించిన కోర్టు, దీనిని విచారణకు స్వీకరించి ఇందుకుబాధ్యులైన అధికారులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.

కలెక్టర్‌ సహా ఏడుగురు అధికారులకు నోటీసులు

ఈ కేసులో జిల్లా కలెక్టర్‌, ఆర్‌డీవో, జిల్లా ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ, ఈఈ, స్థానిక ఆర్‌ అండ్‌బీ ఏఈ, తహశీల్దార్‌, ఎంపీడీవోలకు కోర్టు నోటీసులు జారీ చేశారని, వారంతా ఈనెల 26న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీస్‌లలో ఆదేశించినట్టు న్యాయవాది తెలిపారు.

అధ్వానంగా బీఎన్‌ రోడ్డు

జిల్లాలో ప్రధానమైన బీఎన్‌ రోడ్డు చాలాకాలంగా మరమ్మతులు లేకపోవడంతో శిధిలావస్థకు చేరింది. చోడవరం మండలం గంధవరం నుంచి నర్సీపట్నం వరకూ, బుచ్చెయ్యపేట మండలం వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకూ రహదారి అభివృద్ధికి ఐదేళ్ల క్రితం న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) నిధులు రూ.119 కోట్లు మంజూరయ్యాయి. వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అయితే బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడంతో కాంట్రాక్టర్‌ అర్ధంతరంగా పనులు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పనుల్లో పురోగతి లేదు. పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను అనకాపల్లి ఎంపీ, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కోరినప్పటికీ స్పందన కరువైంది. ఈ రోడ్డు విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా చేతులెత్తేశారు. ఇప్పటికే అధ్వానంగా తయారైన ఈ రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు మరింత దారుణంగా, ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో అటు విశాఖ, ఇటు అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి మొత్తం ధ్వంసమై వర్షం పడితే చెరువును తలపిస్తోంది. ఈ క్రమంలో అనేకమంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కనీసం గుంతలు కూడా కప్పకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.

ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలి

కాండ్రేగుల డేవిడ్‌, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, చోడవరం

చోడవరం, మాడుగుల రహదారుల దుస్థితిపై తాము వేసిన కేసు విచారణకు స్వీకరించి నోటీసులు జారీచేయడం చాలా మంచి పరిణామమని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి స్పష్టమైన ప్రణాళికతో కోర్టుకు వివరణ ఇస్తే ఈ ప్రాంత ప్రజానీకానికి మేలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎంతోకాలంగా ప్రజలు పడుతున్న కష్టాలకు పరిష్కారం దొరికినట్టవుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో న్యాయవాదులు భరత్‌భూషణ్‌, భూపతిరాజులు పాల్గొన్నారు. కాగా బీఎన్‌ రోడ్డు దుస్థితిపై తరచూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోడ్డు విషయంలో ఆర్‌ అండ్‌బీ అధికారులు సైతం ప్రేక్షకుల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్‌ సహా ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు కోర్టు నోటీసులు జారీకావడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jul 07 , 2025 | 11:28 PM