జిల్లాలో కారవాన్ టూరిజం ఏర్పాటు
ABN, Publish Date - May 08 , 2025 | 11:28 PM
ఏజెన్సీలో కారవాన్ టూరిజం ఏర్పాటుకు చర్యలు చేపడతామని, అందుకు అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
భూ సేకరణ చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
గిరిజన గ్రామాల్లో హోమ్ స్టేల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సూచన
పాడేరు, మే 8(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో కారవాన్ టూరిజం ఏర్పాటుకు చర్యలు చేపడతామని, అందుకు అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటకంపై గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం, ముంచంగిపుట్టు మండలం సుజనకోట, రంపచోడవరం, మారేడుమిల్లి, డుంబ్రిగుడ మండలం అంజోడ, చింతపల్లి మండలం చెరువులవేనం పరిసరాల్లో కారవాన్ టూరిజానికి గాను ఒక్కొక్క చోట ఎకరం భూమి సేకరించాలన్నారు. అలాగే గతంలో సూచించిన విధంగా గిరిజన గ్రామాల్లో హోమ్ స్టేల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. హోమ్ స్టేల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసి వచ్చే సెప్టెంబరు నాటికి వాటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అరకులోయ మండలం కొత్తవలసలోని ఉద్యానవన శిక్షణా కేంద్రం, మాడగడ సన్ రైజ్ పాయింట్ వద్ద అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ట్రైబల్ టూరిజం కౌన్సిల్ ఏర్పాటు, గిరిజన అభివృద్ధి ఫండ్ సమకూర్చడంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్ట్ సెంటర్ రూపకల్పనకు ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా నిర్మించుకునే హోమ్ స్టేకు రూ.5 లక్షలు, పాత ఇళ్లను హోమ్ స్టేలకు అనుకూలంగా అభివృద్ధి చేస్తే రూ.3 లక్షలు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. హోమ్ స్టే నిర్వాహకులకు గిరిజన వంటల తయారీపై ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయాలని, ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలు చేస్తే అపరాధ రుసుము వసూళ్లు చేయాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహచలం, జిల్లా పర్యాటకాధికారి జి.దాసు, సీపీవో కేఆర్‌కే.పట్నాయక్, అరకులోయ మ్యూజియం క్యూరేటర్ ఎం.మురళి, జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అటవీ అభివృద్ధి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 11:29 PM