ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఎలమంచిలి’లో క్యాంపు రాజకీయాలు

ABN, Publish Date - Apr 18 , 2025 | 12:10 AM

స్థానిక మునిసిపాలిటీలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. వైసీపీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గకుండా వుండేందుకు చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి తెరవెనుక పావులు కదుపుతున్నారు.

ఎలమంచిలి మునిసిపల్‌ కార్యాలయం

చైర్‌పర్సన్‌ రమాకుమారిపై అవిశ్వాస నోటీసుతో మారుతున్న సమీకరణాలు

గత నెలలో నోటీసుపై 19 మంది వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు

వీరిలో ఎనిమిది మంది తిరిగి చైర్‌పర్సన్‌ గూటికి రాక... ఊటీకి తరలింపు?

మరో ఇద్దరు లేదా ముగ్గురు వస్తారని అంచనా

ఈ నెల 22న అవిశ్వాస నోటీసుపై ప్రత్యేక సమావేశం

తీర్మానం వీగిపోతుందని చైర్‌పర్సన్‌ వర్గం ధీమా

ఎలమంచిలి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. వైసీపీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గకుండా వుండేందుకు చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి తెరవెనుక పావులు కదుపుతున్నారు. అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసిన కౌన్సిలర్లలో సుమారు ఎనిమిది మందిని తమిళనాడులోని ఊటీకి పంపినట్టు తెలిసింది. చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు గత నెలలో ఇచ్చిన నోటీసుపై అధికారులు ఈ నెల 22వ తేదీన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మునిసిపాలిటీ రాజకీయాలు వేడెక్కాయి.

ఎలమంచిలి మునిసిపల్‌ పాలకవర్గానికి నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. మొత్తం 25 వార్డులకుగాను 23 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ, ఇండిపెండెంట్‌ ఒక్కో స్థానంలో విజయం సాధించారు. అప్పటికి కొద్ది నెలల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పిల్లా రమాకుమారిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. గత ఏడాది సాధారణ ఎన్నికల తరువాత రమాకుమారితోపాటు ఆమె సోదరుడు, విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనందకుమార్‌ వైసీపీని వీడి బీజేపీలో చేరారు. మునిసిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్లు వైసీపీకి చెందిన వారు వుండడంతో రమాకుమారిని పదవి నుంచి దించేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. అయితే ఎన్నిక జరిగిన నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వీలులేకపోవడంతో గత నెల వరకు ఆగారు. తరువాత పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు స్థానిక మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో వైసీపీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు సమావేశమై, చైర్‌పర్సన్‌ పదవి నుంచి రమాకుమారిని దించేయాలని, ఈ మేరకు మునిసిపల్‌ కమిషనర్‌లకు అవిశ్వాస నోటీసు అందజేయాలని తీర్మానించారు. అనంతరం 19 మంది సంతకాలతో నోటీసును తయారు చేసి గత నెల 26వ తేదీన వైస్‌ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆర్రెపు గుప్తా ఆధ్వర్యంలో కమిషనర్‌ ప్రసాదరాజుకు అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 22వ తేదీన నర్సీపట్నం ఆర్టీఓ ప్రిసైడింగ్‌ అధికారి హోదాలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్‌ ఇప్పటికే ప్రకటించారు. మునిసిపల్‌ చట్టం ప్రకారం చైర్మన్‌/ చైర్‌పర్సన్‌లపై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది మద్దతు తెలపాలి. 25 మంది కౌన్సిలర్లతోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యునిగా వున్న ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌తో కలిసి 26 మంది సభ్యులు ఉన్నారు. 2/3 వంతు ప్రకారం 17 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలి. అంతకన్నా ఒక్కరు తక్కువైనా సరే తీర్మానం వీగిపోతుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లలో ముగ్గురు (చైర్‌పర్సన్‌ మినహా) మిగిలిన 19 మంది అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు. అప్పటికి రమాకుమారికి ఆరుగురు (ముగ్గురు వైసీపీ, ఒకరు టీడీపీ, మరొకరు ఇండిపెండెంట్‌తోపాటు ఎమ్మెల్యే) మాత్రమే మద్దతుదారులు వున్నారు. దీంతో చైర్‌పర్సన్‌ రాజకీయ వ్యూహాలకు తెరతీశారు. ఆమె స్వయంగా రంగంలోకి దిగకుండా.. తనకు అత్యంత ఆప్తులైన వారికి బాధ్యతలు అప్పగించారు. అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసిన వారితో రాయబారాలు సాగించారు. వారిలో ఎనిమిది మందిని తమవైపునకు తిప్పుకుని, ఇటీవల ఊటీ పంపించారు. మిగిలిన 11 మందిలో ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు తమ శిబిరంలోకి వస్తారని చైర్‌పర్సన్‌ వర్గీయులు చెబుతున్నారు. మొత్తం మీద 17 లేదా 18 మంది సభ్యుల మద్దతు వుంటుందని భావిస్తున్నారు. ఇదే వాస్తవమైతే రమాకుమారి పదవికి ఎటువంటి ఢోకా లేదని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:10 AM