నర్సీపట్నంలో యువకుడి దారుణ హత్య
ABN, Publish Date - Apr 10 , 2025 | 01:12 AM
నర్సీపట్నం అయ్యన్న కాలనీలో నూకాలమ్మ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజ్ ప్రోగ్రామ్ దగ్గర జరిగిన గొడవ ఒక యువకుడి దారుణ హత్యకు దారి తీసింది. పట్టణ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అయ్యన్నకాలనీలో నూకాలమ్మ పండగలో డ్యాన్స్ స్టేజీ వద్దగొడవ
మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణ
చెదరగొట్టి ఇళ్లకు పంపించేసిన పోలీసులు
కొద్దిసేపటి తరువాత ఒక యువకుడి ఇంటికి మరో యువకుడు కత్తితో వెళ్లి దాడి
తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
నర్సీపట్నం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం అయ్యన్న కాలనీలో నూకాలమ్మ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజ్ ప్రోగ్రామ్ దగ్గర జరిగిన గొడవ ఒక యువకుడి దారుణ హత్యకు దారి తీసింది. పట్టణ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నర్సీపట్నం మండలం నీలంపేటకు చెందిన రుత్తల దుర్గాప్రసాద్ (24) మంగళవారం రాత్రి గ్రామానికి సమీపంలో వున్న నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని అయ్యన్న కాలనీ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక)లో జరుగుతున్న నూకాలమ్మ పండగకు వచ్చాడు. డ్యాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్న స్టేజీ ముందు తన స్నేహితుడైన మాకవరపాలెం మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన పైల సాయితో కలిసి డాన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అయ్యన్నకాలనీకి చెందిన చిత్రాడ మహేశ్, అతని స్నేహితులు స్టేజీ దగ్గరకు వచ్చి దుర్గాప్రసాద్, సాయిలతో గొడవ పడ్డారు. మద్యం సేవించి వుండడంతో కొట్లాడుకున్నారు. బందోబస్తులో ఉన్న పట్టణ పోలీసులు వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. సాయితో కలిసి దుర్గాప్రసాద్ రాత్రి నిద్రించడానికి అయ్యన్న కాలనీలో నివాసం ఉంటున్న తన సోదరుడు (పిన్ని కొడుకు) రుత్తల బోడకొండ ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత దుర్గాప్రసాద్‌కి మహేశ్ ఫోన్ చేసి, సాయితో గొడవపడుతుంటే నువ్వెందుకు అడ్డుకున్నావని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మహేశ్ అంతటితో ఆగకుండా అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో దుర్గాప్రసాద్ ఉన్న ఇంటికి వెళ్లి అతనితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహేశ్ వెంట తెచ్చుకున్న కత్తితో దుర్గాప్రసాద్ ఛాతీపై బలంగా పొడిచాడు. ప్రాణభయంతో దుర్గాప్రసాద్ మేడ మీదకు వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు. అంతకుముందు తనను అడ్డుకోబోయిన సాయిని కూడా మహేశ్ కత్తితో పొట్ట మీద, కాలి తొడ భాగంలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. మేడ మీద అపస్మారక స్థితిలో ఉన్న దుర్గా ప్రసాద్‌ను వరుసకు వదిన అయిన మౌనిక (రుత్తల బోడకొండ భార్య) ఆస్పత్రికి తరలించే క్రమంలో దారిలో ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన సాయిని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం అయ్యన్నకాలనీకి వెళ్లారు. పట్టణ సీఐ గోవిందరావు, క్లూస్ టీమ్ మేడ మీద, ఇంటి ఆవరణలో ఆధారాలు సేకరించారు. నిందితుడు మహేశ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది. కాగా దుర్గాప్రసాద్ తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఇతనికి తల్లి, చెల్లెలు ఉన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 01:12 AM