రైతుల అభివృద్ధికి మేధో మథనం
ABN, Publish Date - Jul 17 , 2025 | 10:54 PM
రైతుల అభివృద్ధికి మేధో మథనం చేయాలని, ఏజెన్సీలో సుస్థిరమైన వ్యవసాయాభివృద్ధిని సాధించాలని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్ అన్నారు.
ఏజెన్సీలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధించాలి
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్
అరకులోయ, జూలై 17(ఆంధ్రజ్యోతి): రైతుల అభివృద్ధికి మేధో మథనం చేయాలని, ఏజెన్సీలో సుస్థిరమైన వ్యవసాయాభివృద్ధిని సాధించాలని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్ అన్నారు. వ్యవసాయానుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించాలని తెలిపారు. గురువారం పద్మాపురం గార్డెన్‌లో వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ, డీఆర్‌డీఏ, మార్కెటింగ్ శాఖ, కాఫీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానుబంధ రంగాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఏజెన్సీలో దేశంలో ఎక్కడా లేని వనరులు ఉన్నాయన్నారు. గిరిజనుల జీవనోపాధి మెరుగుపరచాలని, పండ్ల తోటలను మరింత విస్తరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఏజెన్సీలో సాగు చేస్తున్న వరి, రాగులు, రాజ్మా, ఇతర చిరు ధాన్యాల పంటల విస్తీర్ణంపై ఆరా తీశారు. జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య గురించి తెలుసుకున్నారు. బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సమున్నతి ఫౌండేషన్ చైర్మన్ పర్వేష్ శర్మతో భేటీ అయ్యారు. అనంతరం కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ ఆర్గానిక్ కాఫీ సాగు, మిరియాల సాగులో రైతులకు వస్తున్న ఆదాయం, కాఫీ రైతులకు అందిస్తున్న గిట్టుబాటు ధరలు, పసుపు, అల్లం, మిరియాలు, పర్యాటక రంగాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు కె.సింహాచలం, అపూర్వభరత్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఐటీడీఏ ఏపీవో(పీవీటీజీ) ఎం.వెంకటేశ్వరరావు డీఏవో ఎస్‌బీఎస్ నంద్, డీహెచ్‌వోఏ రమేశ్‌కుమార్‌రావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, జిల్లా సెరీకల్చర్ అధికారి కె.అప్పారావు, ఎల్‌డీఎం మాతు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 10:54 PM