బోరుమంటున్న మెకానిక్‌లు
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:15 AM
ఉమ్మడి విశాఖ జిల్లాలోని మంచినీటి బోరు మెకానిక్‌ల జీవనం దుర్భరంగా ఉంది. కనీసం వీరిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కూడా గుర్తించడం లేదు. థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరిట.. అది కూడా కాంట్రాక్టర్ ద్వారా వీరికి గత 30 ఏళ్లుగా జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో నెలల తరబడి వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 92 మంది మంచినీటి బోర్ల మెకానిక్‌లు
సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు
మూడు దశాబ్దాలుగా థర్డ్ పార్టీ ద్వారా వేతనాల చెల్లింపు
కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యాలపైనే జీవనం
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకోలు
కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావం
చోడవరం, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లాలోని మంచినీటి బోరు మెకానిక్‌ల జీవనం దుర్భరంగా ఉంది. కనీసం వీరిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కూడా గుర్తించడం లేదు. థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరిట.. అది కూడా కాంట్రాక్టర్ ద్వారా వీరికి గత 30 ఏళ్లుగా జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో నెలల తరబడి వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండల పరిషత్, గ్రామీణ నీటిసరఫరా శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రంలో 526 మంది మంచినీటి బోరు మెకానిక్‌లు పనిచేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 39 మండలాల్లో 23,600 పైగా బోర్లు ఉన్నాయి. ఈ బోర్ల నిర్వహణకు 92 మంది మెకానిక్‌లు పనిచేస్తున్నారు. మండల పరిషత్‌లకు విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధుల నుంచి ఏటా తాగునీటి వనరుల నిర్వహణ కోసం గ్రాంటు విడుదల చేస్తుంటుంది. ఈ నిధుల్లోనే బోర్లు పరికరాల కొనుగోలుతో పాటు మెకానిక్‌లకు ఇచ్చే వేతనాలు కూడా ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఇప్పటికీ వీరి వేతనం రూ.15 వేలకు మించి లేదు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా బోర్లుతో పాటు రక్షిత మంచినీటి పథకాల బాగోగులు చూసే మెకానిక్‌లకు సక్రమంగా జీతాలు అందడం లేదు. మండల పరిషత్ నుంచి ఇచ్చే వేతనాలు ఎవరైనా కాంట్రాక్టర్ ఖాతాలోకి జమ చేస్తారు. ఆ కాంట్రాక్టర్ ఖాతా నుంచి వీరికి జీతాలు చెల్లిస్తుంటారు. కొందరు కాంట్రాక్టర్లు తమ ఖాతాలో పడిన డబ్బులు వెంటనే ఇచ్చేస్తే, మరికొందరు వారి అవసరాలకు ఖర్చు పెట్టుకుని తమకు నచ్చినప్పుడు లేదా తన వద్ద డబ్బులు ఉన్నపుడు వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. ఇటీవల తమకు జీఎస్‌టీ భారం పడుతుందని చెప్పి కొంత మంది కాంట్రాక్టర్లు వీరికి వచ్చే వేతనాల నుంచి కోత పెడుతున్నారు. ఇక మండలాల్లో మండల పరిషత్ అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వీరి వేతనాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని మండలాల్లో బడ్జెట్ వచ్చినా, దిగువ స్థాయి సిబ్బంది వీరికి సకాలంలో వేతనాల బిల్లు పెట్టే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో కొందరికి నెలల తరబడి వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. ఇంతా చేస్తే వీరికి ఇచ్చే వేతనం రోజుకి రూ.450 మించడం లేదు. ఇందులోనే తమ విధి నిర్వహణ నిమిత్తం గ్రామాలకు వెళ్లిరావడానికి ఇతరత్రా రవాణా ఖర్చులు కూడా భరించవలసిందే.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగానైనా గుర్తిస్తే..
ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఉద్యోగులు మరే శాఖలోనైనా ఉంటే, ఈపాటికి తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలనో లేదా తమ వేతనాలు పెంచాలనో ఆందోళనలు చేసేవారు. అయితే వీరు తమను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగానైనా గుర్తించి ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇలా ప్రభుత్వ శాఖల్లో ఎదుగూబొదుగూ లేని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను గుర్తించి వారికి న్యాయం చేసేందుకు మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అయినా తమకు న్యాయం చేయాలని బోరు మెకానిక్‌లు వేడుకుంటున్నారు.
Updated Date - Jul 23 , 2025 | 12:15 AM