గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:32 AM
మండలంలోని కొక్కిరాపల్లి హైవే పక్కన కార్ల షోరూమ్ వెనుక పంట పొలంలోని గడ్డిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర గురువారం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
ఎలమంచిలి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొక్కిరాపల్లి హైవే పక్కన కార్ల షోరూమ్ వెనుక పంట పొలంలోని గడ్డిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర గురువారం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గురువారం సాయంత్రం సమీపంలో పాడి పశువులు మేపుకునే వారు దుర్వాసన రావడంతో వెళ్లి పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతదేహం దుర్వాసన వస్తున్నదని, సుమారు పది రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని, అతని వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చునని చెప్పారు. మృతదేహం పక్కన రబ్బరు చెప్పులు, కళ్లజోడు, పురుగుల మందు డబ్బా ఉందన్నారు. కొక్కిరాపల్లి వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
కశింకోట, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్సింగబిల్లి - ఎలమంచిలి రైల్వేస్టేషన్ల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తుని రైల్వేపోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ జి. శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఉదయం ఏడు గంటల సమయంలో పోలీసులకు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా వ్యక్తి మృతదేహం లభ్యమైందన్నారు. రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని, ఇతనికి సుమారు 45 సంవత్సరాలు వయసు ఉండొచ్చనని అంచనా వేశారు. ఆర్మీ జంగిల్ డిజైన్ కలిగిన ఫుల్‌హ్యాండ్ షర్టు, 3/4 నలుపు రంగు నిక్కరు ధరించి ఉన్నాడన్నారు. ఇతని జేబులో కచోడ కంపెనీకి చెందిన సెల్‌ఫోన్ లభించిందన్నారు. ఆచూకీ తెలిసిన వారు తుని రైల్వే పోలీస్‌స్టేషన్‌కు, లేదా 9490619020 సెల్ నంబరుకు సంప్రతంచాలని ఆయన కోరారు. కాగా మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చ్యురీకి తరలించామని ఆయన చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రెండు కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
గొలుగొండ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రెండు కిలోల గంజాయితో ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ రామారావు తెలిపారు. మండలంలోని చిట్టింపాడు జంక్షన్ వద్ద గురువారం ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలానికి చెందిన తాంబేలు యాకోబు, తాంబులు లక్ష్మిలను ఆపి తనిఖీ చేశారు. స్కూటీ డిక్కీలో రెండు కిలోల గంజాయి లభించింది. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
38 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్టు
కొయ్యూరు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేసినట్టు మంప ఎస్‌ఐ శంకరరావు తెలిపారు. చింతపల్లి మండలం అన్నవరం నుంచి నర్సీపట్నానికి గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గురువారం సాయంత్రం ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది చీడిపాలెం కూడలి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై రెండు మూటలతో వెళుతున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. తూకం వేయించి 38.375 కిలోలు వున్నట్టు నమోదు చేశారు. ఇతను జీకే వీది మండలం రొంపుల గ్రామానికి గొల్లోరి బొంజిబాబుగా గుర్తించి అరెస్టు చేశారు. గంజాయితోపాటు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
Updated Date - Jun 27 , 2025 | 12:32 AM