నెత్తురోడుతున్న రోడ్లు
ABN, Publish Date - May 29 , 2025 | 01:41 AM
నగరంలో మళ్లీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారుల విస్తరణ జరగకపోవడం, వాహన చోదకుల నిర్లక్ష్యం... ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
నగరంలో మళ్లీ పెరుగుతున్న ప్రమాదాలు
నిబంధనలు పాటించని వాహన చోదకులు
త్వరగా వెళ్లిపోవాలనే ఆత్రుతతో సిగ్నల్ జంపింగ్
ఎదుటి వాహనాలను పట్టించుకోకుండా డ్రైవింగ్
ఇష్టారాజ్యంగా భారీ వాహనాల రాకపోకలు
ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై
పోలీసులకు కానరాని శ్రద్ధ
పెండింగ్ చలాన్‌లు కట్టించడంపైనే దృష్టి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో మళ్లీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారుల విస్తరణ జరగకపోవడం, వాహన చోదకుల నిర్లక్ష్యం... ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
రాష్ట్రంలోనే అతిపెద్దనగరంగా గుర్తింపు పొందిన విశాఖలో సుమారు 13 లక్షల వాహనాలు ఉన్నాయి. రోజురోజుకీ వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా రోడ్లు విస్తరించకపోవడంతో ట్రాఫిక్‌జామ్‌లు నిత్యకృత్యంగా మారాయి. నగరం మధ్య నుంచి వెళుతున్న జాతీయ రహదారిపై బోయిపాలెం నుంచి లంకెలపాలెం వరకూ 32 కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేశారు. అయితే వాహన చోదకులు ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్‌కు పాల్పడడం, సర్వీస్ రోడ్డు నుంచి హఠాత్తుగా జాతీయ రహదారిపైకి రావడం, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపడం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, పరిమితికి మించిన వేగంతో వాహనాలను నడపడం, రోడ్ల డిజైన్‌లో లోపాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడళ్లను అభివృద్ధి చేయకపోవడం, నగరంలోకి రద్దీ సమయాల్లో భారీ వాహనాలు ప్రవేశించడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. బుధవారం తెల్లవారుజామున సత్యం కూడలి వద్ద మర్రిపాలేనికి చెందిన బుగత రాము (35) ద్విచక్ర వాహనంపై మద్దిలపాలెం వైపు వెళుతుండగా, వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అదే ప్రాంతంలో ఈనెల 23న ద్విచక్ర వాహనంపై వెళుతున్న వైద్య విద్యార్థిని కారు ఢీకొనడంతో మృతిచెందింది. ఈనెల 24న సంగివలస వద్ద రహదారి దాటుతున్న దివీస్ ఉద్యోగిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
బ్లాక్‌స్పాట్లపై నిర్లక్ష్యం
ఈ ఏడాది మొదట్లో కాస్త తగ్గినట్టు కనిపించిన రోడ్డుప్రమాదాలు ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. నగరంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 68 ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో రాత్రిపూట లైటింగ్‌కు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలు, పొదలను తొలగించారు. బ్లాక్‌స్పాట్‌ల వద్ద లైటింగ్ పెంచారు. హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయడంతో పాటు ఒక కానిస్టేబుల్‌ను రాత్రిపూట అక్కడ విధుల్లో ఉంచేవారు. దీనివల్ల ఈ ఏడాది మొదట్లో రోడ్డు ప్రమాదాలు తగ్గినట్టు కనిపించాయి. తర్వాత ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2022లో 1,353 ప్రమాదాలు జరగ్గా 346 మంది మృతిచెందారు. 2023లో 1,180 రోడ్డు ప్రమాదాలు జరిగి 209 మంది మరణించారు. 2024లో రోడ్డు ప్రమాదాలు 1094కి తగ్గగా, మరణాల సంఖ్య మాత్రం 261కి పెరిగింది. ఈ ఏడాది మే 27 నాటికి నగరంలో దాదాపు 625 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆయా ప్రమాదాల్లో 130 మంది మృతిచెందారు.
ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శలు
వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన ట్రాఫిక్ పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూడలి వద్ద ఒకరు, లేదా ఇద్దరు సిబ్బంది ఉండి ట్రాఫిక్ విధులను నిర్వర్తించాల్సింది పోయి, ఐదు నుంచి పది మంది వరకూ ఒకచోట గుమికూడుతున్నారు. ఆ మార్గంలో వచ్చిపోయే వాహనాలను అకస్మాత్తుగా ఆపుతున్నారు. ఆయా వాహనాలకు ఏమైనా పెండింగ్ చలాన్‌లు ఉన్నాయా? అని మొబైల్ యాప్‌లో తనిఖీ చేస్తున్నారు. పెండింగ్ చలాన్‌లు ఉంటే అక్కడికక్కడే కట్టిస్తున్నారు. పక్కనే ట్రాఫిక్ జామ్ అయిపోయినా సరే తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పోలీసుల ప్రధాన విధులను పక్కనపెట్టి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసం ఎదురుచూస్తూ కనిపించగానే ఫొటోలు తీయడం, పెండింగ్ చలాన్‌లు కట్టించడంలోనే నిమగ్రమై పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - May 30 , 2025 | 03:00 PM