ఇంజనీరింగ్‌లో బిల్లుల పంచాయితీ!
ABN, Publish Date - Jul 29 , 2025 | 01:13 AM
జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయనే ప్రచారం జరుగుతోంది.
భీమిలి బీచ్‌లో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సాయిరెడ్డి కుమార్తె కాంక్రీట్ నిర్మాణం
హైకోర్టు ఆదేశాల మేరకు తొలగింపునకు చర్యలు తీసుకున్న జీవీఎంసీ
మౌఖిక ఆదేశాలతో పనులు అప్పగింత
తాజాగా బిల్లు చెల్లింపు బాధ్యత తమది కాదంటే తమదికాదని వాదులాట
జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్‌లకు ఫిర్యాదు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయనే ప్రచారం జరుగుతోంది. భీమిలి బీచ్‌లో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన భారీ కాంక్రీట్ నిర్మాణాల తొలగింపునకు సంబంధించిన పనుల బిల్లుల చెల్లింపుపై తాజాగా మెకానికల్, పబ్లిక్ వర్క్సు ఇంజనీరింగ్ అధికారుల మధ్య పంచాయితీ నడుస్తోంది. చివరికి ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి వెళ్లింది.
భీమిలి బీచ్‌లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ కాంక్రీట్‌తో భారీగా ప్రహరీగోడను నిర్మించింది. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా తీరంలో భారీ నిర్మాణాలు చేపట్టి పర్యావరణాన్ని దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు వాటిని తొలగించాల్సిందిగా జీవీఎంసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ కొంతమంది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కాంక్రీట్ గోడను మార్చి 26లోగా తొలగించాలని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించింది. దీంతో భీమిలి (జోన్-1) టౌన్‌ప్లానింగ్ ఏసీపీ ఆధ్వర్యంలో బీచ్‌లోని నిర్మాణాలను పరిశీలించారు. సుమారు ఆరు అడుగుల లోతున ఫుట్టింగ్‌లు వేసి 588 మీటర్ల మేర సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మించారని, దానిని తొలగించేందుకు అవసరమైన జేసీబీలను ఏర్పాటుచేయాలని కోరుతూ జోన్-1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు ప్రతిపాదన పంపించారు. ఆ నిర్మాణాలను తొలగించాలంటే 200 కెపాసిటీ కలిగిన బ్రేకర్ జేసీబీ యంత్రాలు ఉండాలని, అవి జీవీఎంసీ వద్ద లేనందున ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం సుమారు రూ.70 లక్షలు ఖర్చవుతుందని పేర్కొంటూ అంచనాలను అప్పటి జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరించిన జిల్లా కలెక్టర్‌కు పంపించారు. తర్వాత మెకానికల్ విభాగం అధికారులు ఐదు ప్రైవేటు ఏజెన్సీల నుంచి ఐదు 200 బ్రేకర్ జేసీబీలతో బీచ్‌లో నిర్మించిన కాంక్రీట్‌గోడను పునాదులతో సహా తొలగించే పనులను మార్చి ఎనిమిదిన ప్రారంభించి, 17 రోజులపాటు కొనసాగించారు. అప్పటికి 321 మీటర్ల గోడను తొలగించి, డెబ్రిస్‌ను కాపులుప్పాడలోని యార్డుకు తరలించారు. అంతవరకూ అయిన బిల్లు చెల్లిస్తేనేగానీ మిగిలిన పనులను పూర్తిచేయలేమని కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. తాను యంత్రాలను ఎంగేజ్ చేయలేదు కాబట్టి, బిల్లు పెట్టలేనంటూ భీమిలి జోన్ ఈఈ అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో కాంట్రాక్టర్లు మెకానికల్ విభాగం అధికారులను సంప్రతిస్తే పనుల అంచనాలను పబ్లిక్ వర్క్స్ ఈఈ...కలెక్టర్‌కు పంపించినందున అక్కడి నుంచే బిల్లు ప్రిపేర్ చేయాలని సమాధానం ఇచ్చారు. ఈలోగా మెకానికల్ ఈఈగా పనిచేసిన చిరంజీవి ఉద్యోగ విరమణ చేయగా, భీమిలి జోన్ ఈఈగా పనిచేసిన దిలీప్‌కుమార్‌కు జోన్-8కు బదిలీ అయిపోయింది. అనంతరం వచ్చిన అధికారులు బిల్లు పంచాయితీని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం ప్రారంభించారు.
కమిషనర్‌కు ఫిర్యాదు
దీంతో కాంట్రాక్టర్లంతా గత నెల 30న జీవీఎంసీ కమిషనర్‌ను కలిసి బిల్లు చెల్లింపులో ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, వారి మధ్య సమన్వయలోపంపై ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ (ఫైనాన్స్)ను కమిషనర్‌ను ఆదేశించారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా ఈనెల 21న జిల్లా కలెక్టర్‌ను కలిసి ఇంజనీరింగ్ అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణం పనులు ప్రారంభించాలని, తర్వాత వర్క్ ఆర్డర్‌ను ఇచ్చి ర్యాటిఫై చేయిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు తమను బలిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ పల్లంరాజును వివరణ కోరగా భీమిలి బీచ్‌లో నిర్మాణాల తొలగింపునకు సంబంధించిన బిల్లు చెల్లింపు విషయంలో మెకానికల్, పబ్లిక్ వర్క్సు ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయం లోపించిందని అంగీకరించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, బిల్లు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని మెకానికల్, పబ్లిక్స్‌వర్క్సు అధికారులను ఆదేశించానన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - Jul 29 , 2025 | 01:13 AM