ఉచిత విద్యుత్‌కు రూ.వేలల్లో బిల్లులా?
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:59 AM
ఉచిత విద్యుత్ పేరుతో సరఫరా అవుతున్న వ్యవసాయ రంగ మీటర్లకు రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయని రైతులు వాపోయారు. స్మార్ట్ మీటర్లు బిగించిన తరువాతే ఈ పరిస్థితి వచ్చిందని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వెంకటాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.
- స్మార్ట్ మీటర్లను తొలగించాలంటూ ఆందోళన
- వెంకటాపురం సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
మునగపాక, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఉచిత విద్యుత్ పేరుతో సరఫరా అవుతున్న వ్యవసాయ రంగ మీటర్లకు రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయని రైతులు వాపోయారు. స్మార్ట్ మీటర్లు బిగించిన తరువాతే ఈ పరిస్థితి వచ్చిందని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వెంకటాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వెంకటాపురం గ్రామానికి చెందిన కడియం కృష్ణగోవిందరావు, బలిరెడ్డి రామారావు, సుందరపు కాశీవిశ్వనాథ్ సత్యారావు, కడియం అప్పలనర్సమ్మ, పండూరి తాతయ్య, పండూరి చినఅప్పలనాయుడు, తదితర రైతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి మీటర్‌కు రూ.15 వేలు నుంచి పాతిక వేల రూపాయల వరకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ నోటీసులు వచ్చాయని తెలిపారు. ఆగస్టులో బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిక కూడా చేశారని చెప్పారు. మాజీ ఉపసర్పంచ్ గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఇప్పటి వరకు నెలకు రూ.30 చొప్పున మాత్రమే వినియోగంతో సంబంధం లేకుండా విధించే వారన్నారు. గృహాలకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సబ్‌స్టేషన్ వద్ద డిమాండ్ నోటీసులను దహనం చేశారు. అనంతరం బిల్లులు రద్దు చేయాలని, మీటర్లు తొలగించాలని కోరుతూ ఏఈ జగదీస్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు ఆళ్ళ మహేశ్వరరావు, ఎస్.బ్రహ్మాజి, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 12:59 AM