పోలీసులున్నారు జాగ్రత్త!
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:53 AM
నగరంలో నేరాలను అరికట్టాల్సిన పోలీసు యంత్రాం గం జరిమానా వసూలు చేసే చట్టాలను అమలుచేయడంలో బిజీగా మారింది. ఇప్పటికే ద్విచక్ర వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించినా సిగ్నళ్ల వద్ద పంచాయితీ పెడుతున్నారు. పాత చలానాలున్నాయా? అని పరిశీలించి చెల్లించేవరకు వదిలి పెట్టడం లేదు. తాజాగా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాలిస్తే (ధూమపానం) రూ.200 వరకు జరిమానా వేసే చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసే చర్యలు చేపట్టడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
బహిరంగంగా సిగరెట్ కాల్చినా జరిమానా
నగరంలో విస్తృతంగా సోదాలు
రహదారి పొడవునా ఎక్కడికక్కడ తనిఖీలు
విశాఖపట్నం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి):
నగరంలో నేరాలను అరికట్టాల్సిన పోలీసు యంత్రాం గం జరిమానా వసూలు చేసే చట్టాలను అమలుచేయడంలో బిజీగా మారింది. ఇప్పటికే ద్విచక్ర వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించినా సిగ్నళ్ల వద్ద పంచాయితీ పెడుతున్నారు. పాత చలానాలున్నాయా? అని పరిశీలించి చెల్లించేవరకు వదిలి పెట్టడం లేదు. తాజాగా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాలిస్తే (ధూమపానం) రూ.200 వరకు జరిమానా వేసే చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసే చర్యలు చేపట్టడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ఈ చట్టంపై నగర పోలీసులు ఇప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇటీవల దీనిపై కూడా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఐదు రోజుల క్రితం మధురవాడ వైపు వెళుతున్న లారీ సిబ్బంది జూ పార్క్ వద్ద రాత్రి 11 గంటలు దాటిన తరువాత వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, కిందికి దిగి సిగరెట్ కాల్చుకుంటున్నారు. అటు వైపు వెళ్తున్న పోలీసులు ఆగి వారిని ప్రశ్నించి, ఆరు బయట సిగరెట్ కాలుస్తున్నందున జరిమానా కట్టాలని రూ.200 చొప్పున చలానా వసూలు చేశారు. ఎవరూ లేని ప్రదేశంలో అర్ధరాత్రి సిగరెట్ కాల్చడం నేరమా? అని వారు ప్రశ్నిస్తే...బయట ఎక్కడ కాల్చినా తప్పే అని సమాధానమిచ్చారు.
పాన్ షాపుల వద్ద ...
నగరంలో ప్రతి పాన్‌షాపులో సిగరెట్లు అమ్ముతున్నారు. ధూమపాన ప్రియలు ఇంటికి వెళ్లి కాలిస్తే భార్యాబిడ్డలు గమనిస్తారని, సిగరెట్ కొన్న దగ్గరే నాలుగు దమ్ములు లాగేసి, పారేసి పోతుంటారు. ఇలాంటి వారి కోసం పాన్‌షాపు నిర్వాహకులు లైటర్లు తాడు కట్టి మరీ ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి ఏర్పాట్లు ఉన్నప్పుడు బహిరంగంగా కాకుండా ఇంకెక్కడ కాలుస్తారనేది ప్రశ్న. పోలీసులు వీటిపై కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
పెదవాల్తేరు పండగలో డ్రంకన్ డ్రైవ్ కేసులు
నగరంలో డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసేందుకు వీలుగా మద్యం దుకాణాల పక్కన మాటువేసి కేసులు పెట్టడం రివాజు. ప్రస్తుతం పండగల సీజన్. అన్ని ప్రాంతాల్లో అమ్మవారి జాతరలు జరుగుతున్నాయి. వీటిని పోలీసులు కేసుల కోసం ఉపయోగించుకుంటున్నారు. తాజాగా మంగళవారం పెదవాల్తేరు పోలమాంబ జాతర జరిగింది. ఆ ప్రాంతంలోని అన్ని జంక్షన్లలో పోలీసులు రాత్రి కాపు కాచి, వాహనాలను ఆపి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. బ్రీథింగ్ ఎనలైజర్ పరీక్షలు చేసి కేసులు పెట్టారు. భార్యాపిల్లలతో స్కూటీలపై వెళుతున్న వారిని కూడా ఆపి పరీక్షలు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. పండగ పూట ఈ కేసుల గొడవ ఏమిటని వాపోతున్నారు. ఏదేమైనా రోడ్డు పైకి వస్తే పోలీసు జరిమానాల బారిన పడకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నగరవాసులు వాపోతున్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:53 AM