ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీఎంఆర్‌డీఏ వేలం పాటల్లో బినామీలు

ABN, Publish Date - Jul 04 , 2025 | 01:23 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నిబంధనలు అవకతవకలకు అవకాశం కల్పిస్తున్నాయి.

  • అవసరం లేకున్నా దుకాణాలకు దరఖాస్తులు

  • పాటలో పాల్గొనకుండా ఉండేందుకు సొమ్ములు డిమాండ్‌

  • ఈ క్రమంలో సంస్థ ఆదాయానికి గండి

  • ఓ వాణిజ్య సముదాయంలో రూ.80 వేల అద్దె వచ్చే దుకాణం రూ.14 వేలకు...

  • ప్లాట్లు, ఫ్లాట్లు, దుకాణాలకు అప్‌సెట్‌ ధర నిర్ణయించి లాటరీ ద్వారా కేటాయించాలని కోరుతున్న వ్యాపారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నిబంధనలు అవకతవకలకు అవకాశం కల్పిస్తున్నాయి. లేఅవుట్లలో ప్లాట్లు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాల్లో దుకాణాలను అప్‌సెట్‌ ధర నిర్ణయించి, ఆపై వేలం ద్వారానే కేటాయించాలనేది వీఎంఆర్‌డీఏ నిబంధన. అయితే అవసరం లేకున్నా కొందరు వేలంలో పాల్గొని వాటి రేట్లు పెంచేసి లబ్ధి పొందుతున్నారు. లేఅవుట్లలో అయితే రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఏజెంట్లు పాల్గొని ఒక ప్లాటు ధర అత్యధికంగా పాడేసి వదిలేస్తున్నారు. అదే ధరకు మిగిలిన ప్లాట్లు అమ్మడానికి వీఎంఆర్‌డీఏ యత్నిస్తోంది. ఆ ఏజెంట్లు అదే ప్రాంతంలో తమ లేఅవుట్లను వీఎంఆర్‌డీఏ కంటే తక్కువ రేట్లకు అమ్ముకొని లబ్ధి పొందుతున్నారు.

వాణిజ్య సముదాయాల్లో దుకాణాల వేలంలోను ఇటీవల ఇదే తరహాలో దందా మొదలైంది. ఎక్కడైనా డిమాండ్‌ కలిగిన ప్రాంతాల్లో వీఎంఆర్‌డీఏ దుకాణాలను వేలానికి పెడితే ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కొందరు వారికి అవసరం లేకపోయినా దరఖాస్తు చేస్తున్నారు. వేలంలో పాల్గొంటున్నారు. పోటీ పడి అద్దె రేట్లు పెంచేస్తున్నారు. తాము వెనక్కి తగ్గాలంటే తగిన ప్రతిఫలం ఇవ్వాలని, ఆ దుకాణం కోసం పోటీ పడే వ్యాపారిని డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో వారికి ఎంతో కొంత ఇచ్చి పోటీ నుంచి తప్పించాల్సి వస్తోంది. ఇదేక్రమంలో ఒక్కోసారి వారంతా రింగ్‌గా మారి వీఎంఆర్‌డీఏకు రావలసిన ఆదాయానికి కూడా గండి కొడుతున్నారు. తాజాగా ఇదే జరిగింది. రామ్‌నగర్‌లోని కొత్త వాణిజ్య సముదాయంలో ఖాళీగా ఉన్న దుకాణాలకు వీఎంఆర్‌డీఏ జూన్‌ నెలలో దరఖాస్తులు ఆహ్వానించింది. అందులో కొన్ని ఎస్‌సీ, ఎస్‌టీలకు కేటాయించింది. అద్దె మిగిలిన వారితో పోల్చుకుంటే తక్కువగా నిర్ణయించింది. అందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 5వ నంబరు దుకాణానికి వేలం నిర్వహించగా ఆరుగురు పాల్గొని రింగ్‌ అయిపోయి నెలకు రూ.14 వేలకే పాడుకున్నారు. అదే దుకాణానికి అంతకు ముందు నిర్వహించిన వేలంలో రూ.83 వేల అద్దె పలికింది. అయితే పాటదారుడు నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకొని మళ్లీ పాట నిర్వహించారు. ఇలాంటి సమయాల్లో గతంలో వేలంలో ఎంత ధర పలికిందో అదే అప్‌సెట్‌ ధరగా నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ ఆ దుకాణదారుడు అద్దెకు తీసుకోలేదు కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. అదే భవనంలో అంతే విస్తీర్ణం కలిగిన దుకాణాలకు ఒక్కొక్కరు సగటున నెలకు రూ.80 వేలు కడుతుంటే...రింగ్‌ అయినవారు రూ.14 వేలకు దక్కించుకోవడంతో విషయాన్ని చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ దృష్టికి తీసుకువెళ్లారు. సంస్థకు ఆ ఒక్క దుకాణం వల్లే నెలకు రూ.70 వేలు నష్టం వస్తున్నట్టు గమనించి, ఆయన అధికారులను పిలిచి మాట్లాడగా తప్పు జరిగినట్టు అంగీకరించారు. ఆ దుకాణం కేటాయింపును పెండింగ్‌లో పెట్టి మళ్లీ వేలం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఫిర్యాదు వచ్చింది కాబట్టి విషయం బయట పడిందని, ఇలా ఇంకెన్ని ఉన్నాయో చూడాలని ఆయన ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటివి నివారించడానికి వేలం పెట్టకుండా నిర్ణీత ధర పెట్టి లాటరీ ద్వారా కేటాయిస్తే అక్రమాలకు అవకాశం ఉండదని వ్యాపారులు సూచిస్తున్నారు. అధికారులు దీనిపై పునరాలోచన చేయాల్సి ఉంది.

Updated Date - Jul 04 , 2025 | 01:23 AM