ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంచం పట్టిన భద్రయ్యపేట

ABN, Publish Date - Jul 23 , 2025 | 01:02 AM

మండలంలోని రెడ్డిపల్లి పంచాయతీ భద్రయ్యపేటను కిడ్నీ వ్యాధి పీడిస్తోంది.

  • గ్రామస్థులను వణికిస్తున్న కిడ్నీ వ్యాధి

  • ఇప్పటికే వ్యాధి బారినపడి 20 మంది మృతి

  • తాజాగా మరో 50 మంది బాధితులు

  • కలుషిత జలాలే కారణమంటున్న స్థానికులు

పద్మనాభం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని రెడ్డిపల్లి పంచాయతీ భద్రయ్యపేటను కిడ్నీ వ్యాధి పీడిస్తోంది. కేవలం 280 మంది జనాభా నివసించే ఈ గ్రామంలో తాజాగా 160 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 50 మందికి కిడ్నీ సమస్య ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. కాగా గ్రామంలో మిగిలిన వారికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా మరెంతమందిలో వ్యాధి బయటపడుతుందోననే ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా గ్రామంలో ఇప్పటివరకూ సుమారు 20 మంది కిడ్నీ వ్యాధితోనే మృత్యువాత పడినట్టు సమాచారం.

భద్రయ్యపేటలో కిడ్నీ వ్యాధి బారినపడుతున్న వారు తీవ్రమైన నడుమునొప్పి, నీరసం, కాళ్లు పీకులు, ఒళ్లు నొప్పులతో మంచానికే పరిమితమవుతున్నారు. దీంతో ఉపాధి లేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన వారికి సీరం క్రియాటినిన్‌ ఎక్కువగా ఉందని నిర్ధారణ కావడంతో కేజీహెచ్‌లో మంగళవారం పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో నీరు కలుషితమవ్వడమే వ్యాధికి కారణమని తేలింది. అయితే అధికారులు తాత్కాలిక ఉపశమనంగా నీటిలో కలిపేందుకు గుళికలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పట్టించుకోని నేతలు, అధికారులు

గ్రామాన్ని కిడ్నీ వ్యాధి కబళిస్తోందని, ఒక్కొక్కరుగా బలైపోతున్నారని గగ్గోలు పెడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ నుంచి ఇద్దరు నేతలు జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైనప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదంటున్నారు.

క్వారీలే కారణమా?

భద్రయ్యపేట చుట్టూ దశాబ్దాలుగా మూడు క్వారీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా తవ్వేస్తున్నారు. ఇందుకోసం విషపూరిత రసాయనాలతో కూడిన పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. ఆ నీటిని తాగుతుండడంతో కిడ్నీ వ్యాధి సోకిందని చెబుతున్నారు. నిబంధనలను అతిక్రమించి క్వారీలు నిర్వహిస్తున్నారని గనులు, భూగర్భ వనరుల శాఖకు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కిడ్నీ వ్యాధి నుంచి గ్రామస్థులను కాపాడాలని కోరుతున్నారు.

Updated Date - Jul 23 , 2025 | 01:02 AM