బాబ్జీ వర్సెస్ మేయర్
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:45 AM
పెందుర్తి టీడీపీలో నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న గొడవలు బహిర్గతమయ్యాయి.
పెందుర్తి టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
పరిశీలకుడి సమక్షంలోనే వాగ్వాదం
పార్టీ సమావేశాలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వడం లేదని పీలా ఆరోపణ
మేయర్‌గా పెందుర్తిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తనను ఆహ్వానిస్తున్నారా?...అని ప్రశ్నించిన బాబ్జీ
ఇరువురికీ సర్దిచెప్పిన పరిశీలకుడు
పెందుర్తి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి టీడీపీలో నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న గొడవలు బహిర్గతమయ్యాయి. కార్యకర్తల సమక్షంలో నాయకులు వాగ్వాదానికి దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంస్థాగత కమిటీల ఎన్నిక, నియామకం కోసం స్థానిక వెలమ భవన్‌లో శనివారం పెందుర్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి గండి బాబ్జీ అధ్యక్షతన ఎన్నికల పరిశీలకుడు కోరాడ రాజబాబు సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రెడ్డి నారాయణరావు, వార్డు అధ్యక్షుడు వేగి పరమేశ్వరరావు, నగర పార్టీ ఉపాధ్యక్షుడు అవగడ్డ అప్పలనాయుడు, తదితరులు హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించిన గండి బాబ్జీ, పరిశీలకుడు కోరాడ రాజబాబులు మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేలా కమిటీలు నియామకం జరుగుతుందన్నారు. అనంతరం మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతున్న సమయంలో ఇన్‌చార్జి బాబ్జీ నిలువరించడంతో వివాదం మొదలైంది.
టీడీపీ ఇన్‌చార్జి బాబ్జీ వెర్సస్ మేయరు పీలా
పెందుర్తి నియోజకవర్గ సమావేశాలకు ఇన్‌చార్జి నుంచి తనకు కనీస సమాచారం లేదని మేయర్ పీలా ఆరోపించారు. ‘కార్యకర్తలను సమన్వయం చేసుకునే బాధ్యత మీకు లేదా?, గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశారు కదా. మీకంటే ముందే నగర పార్టీ అధ్యక్షుడుగా చేశాను. రాష్ట్ర పార్టీలో పలు పదవులు చేపట్టాను. ఇదేనా సీనియర్లకు ఇచ్చే గౌరవం’...అంటూ పీలా అసంతృప్తి వ్యక్తం చేశారు. పీలా వ్యాఖ్యలకు గండి బాబ్జీ బదులిస్తూ ‘మేయర్‌గా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న నాకు ఏనాడైనా ఆహ్వానం అందిందా. నగరం వరకూ ఎందుకు?, కనీసం పెందుర్తిలోనైనా సమాచారం ఇవ్వక్కర్లేదా...ఇది సరైనదేనా, నువ్వు ఆలోచించుకోవాలి’...అన్నారు. దాంతో పీలా లేచి వేరే మైకు అందుకుని ప్రోటోకాల్ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు ముడి పెట్టవద్దని, అక్కడ పిలవలేదని అక్కసుతో పార్టీ కార్యక్రమాలకు పిలవరా...అని ప్రశ్నించారు. ఇరువురి నడుమ వాదోపవాదాలు కొనసాగడంతో పరిశీలకుడు కోరాడ రాజబాబు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. దీంతో సభలో ఉద్రిక్తత తగ్గి సాధారణ స్థితి నెలకుంది. అంతకుముందు బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇన్‌చార్జి నుంచి సమాచారం లేదని కరక దేవుడు ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, యని, ఇప్పుడు కనీస ప్రాధాన్యం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్టీలో ఇెవన్నీ సహజం
అనంతరం పరిశీలకుడు కోరాడ రాజబాబు మాట్లాడుతూ టీడీపీ అంతా ఒక కుటుంబమని, పార్టీలో అసంతృప్తులు సహజమని అన్నారు. అన్నీ సరిదిద్దుతాం, కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని అన్నారు. మండల, వార్డులకు సంబంధించి 15 మందిని సమన్వయకర్తలుగా నియమించామన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 12:45 AM