నేటి నుంచి ఆటోమ్యుటేషన్
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:43 AM
విశాఖపట్నంలో స్థిరాస్తి కొనుగోలుదారులకు శుక్రవారం నుంచి ఆటోమ్యుటేషన్ విధానం అమలు కానుంది.
స్థిరాస్తి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే జీవీఎంసీ రికార్డుల్లో కూడా పేరు మార్పు
ఆస్తి పన్ను, నీటి పన్ను అన్నీ ఒకే క్లిక్‌తో...
విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో స్థిరాస్తి కొనుగోలుదారులకు శుక్రవారం నుంచి ఆటోమ్యుటేషన్ విధానం అమలు కానుంది. అంటే ఏదైనా స్థిరాస్తి (ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ఖాళీ స్థలం) కొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకుంటే...ఆ వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో జీవీఎంసీ అధికారులకు పంపించి, అక్కడ కూడా కొత్త యజమాని పేరు రికార్డుల్లో మారుస్తారు. దీనిని ‘మ్యుటేషన్’ అంటారు.
ఇప్పటివరకూ ఇలా జీవీసీఎం రికార్డుల్లో పేరు మార్చుకోవాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఆ పని ఎప్పటికోగాని పూర్తయ్యేది కాదు. యాజమాన్య హక్కుల్లో వివాదాలు వస్తున్నందున, కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ‘ఆటో మ్యుటేషన్’ విధానం అమలులోకి తీసుకువచ్చింది. ఈ ప్రక్రియలో స్థిరాస్తి అమ్ముతున్న వ్యక్తి ప్రభుత్వానికి ఏమైనా పన్ను బకాయిలు ఉంటే...ఆన్‌లైన్‌లో ఆ వివరాలు చూపిస్తుంది. వాటిని కూడా చెల్లించాకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో కొనుగోలుదారులకు ఇబ్బందులు ఉండవు. పాత పన్ను బకాయిలు కట్టాలని నోటీసులు ఏమీ రావు. దీంతో పాటు కొళాయి కనెక్షన్ పేరు కూడా రికార్డుల్లో మారుతుంది. దశల వారీగా విద్యుత్ మీటరు పేరు కూడా మార్చడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి జీవీఎంసీ, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులను లింక్ చేశారు. త్వరలో సంబంధిత విభాగాలతోను అనుసంధానం చేయనున్నారు.
Updated Date - Aug 01 , 2025 | 12:43 AM