సముద్ర తీరంలో రాళ్లలో చిక్కుకుని ఆటో డ్రైవర్ మృతి
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:32 PM
రాంబిల్లి పంచాయతీ శివారు వాడపాలెం సముద్రతీరం వద్ద రాళ్ల మధ్యలో చిక్కుకుపోయి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ అప్పారావు తెలిపిన వివరాలిలా వున్నాయి.
రాంబిల్లి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాంబిల్లి పంచాయతీ శివారు వాడపాలెం సముద్రతీరం వద్ద రాళ్ల మధ్యలో చిక్కుకుపోయి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ అప్పారావు తెలిపిన వివరాలిలా వున్నాయి. రాంబిల్లికి చెందిన పెనుకొండ తాతాజీ (55) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయం ఆస్పత్రికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో వాడపాలెం సముద్ర తీరం వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాళ్ల మధ్యలో చిక్కుకొని మృతిచెందిపడి వుండడాన్ని కొంతమంది మత్స్యకారులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్‌ఐ అప్పారావు, సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. రాళ్ల మధ్య చిక్కుకుని చనిపోయిన వ్యక్తిని బయటకు తీయించేందుకు చర్యలు చేపట్టారు. అయితే అలల తాకిడి తీవ్రంగా వుండడంతో మత్స్యకారుల సాయంతో సాయంత్రం ఐదు గంటలకు మృతదేహాన్ని బయటకు తీశారు. ఇతను రాంబిల్లికి చెందిన ఆటో డ్రైవర్ పెనుకొండ తాతాజీగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భార్య, పిల్లలు వచ్చి భోరున విలపించారు. పోలీసులు పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రికి వెళుతున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పిన తాతాజీ.. సముద్రం వద్దకు ఎందుకు వెళ్లాడు? మరణానికి కారణం ఏమిటో దర్యాప్తులో తేలుతుందని కేసు నమోదు చేసిన ఏఎస్‌ఐ అప్పారావు చెప్పారు.
Updated Date - Jul 21 , 2025 | 11:32 PM