అప్పన్న సన్నిధిలో అశోక్‌గజపతిరాజు
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:49 AM
గోవా గవర్నర్‌గా నియమితులైన తరువాత తొలిసారిగా వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన పూసపాటి అశోక్‌గజపతిరాజుకు శుక్రవారం సింహగిరిపై ఘనస్వాగతం లభించింది.
గవర్నర్‌గా నియమితులైన తరువాత తొలిసారిగా దర్శనానికి రాక
స్వాగతం పలికిన అధికారులు, పండితులు, ఉద్యోగులు
సింహాచలం, జూలై 18 (ఆంధ్రజ్యోతి):
గోవా గవర్నర్‌గా నియమితులైన తరువాత తొలిసారిగా వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన పూసపాటి అశోక్‌గజపతిరాజుకు శుక్రవారం సింహగిరిపై ఘనస్వాగతం లభించింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో నాదస్వర విద్వాంసుల మంగళకర వాయిద్యాల నడుమ ఆలయ పండితులు, వైదికులు, ఆగమ పాఠశాల విద్యార్ధులు అశోక్‌గజపతిరాజు దంపతులను సాదరంగా స్వాగతించారు. ధ్వజస్తంభం వద్ద పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. ఆయన గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేసి, శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. కప్పస్తంభ ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలిచ్చారు. దేవస్థానం ఈఓ త్రినాథరావు శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అలాగే అశోక్‌గజపతిరాజును దేవస్థానం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సింహగిరి వర్తకసంఘం ప్రతినిధులు, పలువురు అడివివరం గ్రామస్థులు శాలువాలు, పుష్పమాలికలతో అభినందించారు. అందరికీ ఆయన చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ తన తాత, తండ్రి నుంచి తమ బిడ్డల వరకూ సింహాద్రినాథునికి సేవలు చేయగలగడం స్వామి కటాక్షంగా భావిస్తున్నట్టు చెప్పారు. బాల్యంలో తండ్రి పీవీజీ రాజు తమ తల నీలాలను సమర్పించడం, ఆ తరువాత తమ బిడ్డల తలనీలాలు సమర్పించడం నుంచి నేటివరకూ జరిగిన పరిణామాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
Updated Date - Jul 19 , 2025 | 12:49 AM