యోగా దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు
ABN, Publish Date - May 20 , 2025 | 11:30 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
నేటి నుంచి నెల రోజులు యోగా తర్ఫీదు చేయాలి
డివిజన్, మండల, పంచాయతీ స్థాయిలోకమిటీలు ఏర్పాటు చేయాలి
పాడేరు, మే 20 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జూన్ 21న నిర్వహించే యోగా దినోత్సవం, యోగాంధ్ర- 2025పై కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగాంధ్ర- 2025లో భాగంగా ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు వాడవాడలా యోగాపై తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. అలాగే బుధవారం జిల్లా కేంద్రంలో ముందస్తు యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అలాగే ప్రముఖ పర్యాటక కేంద్రాలు, మండల, పంచాయతీ స్థాయిల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అలాగే జూన్ 21న యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన మాస్టర్ ట్రైనర్లను గుర్తించి, వారి ద్వారా అందరికీ అవసరమైన శిక్షణ అందించాలన్నారు. అలాగే ఐటీడీఏ పీవోలతో డివిజన్ స్థాయిలో, ఎంపీడీవోలతో మండల, పంచాయతీ కార్యదర్శులతో పంచాయతీ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. వాటిని పర్యవేక్షించేందుకు జిల్లా అధికారులతో జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఈనెల 21 నుంచి ఆయా స్థాయిల్లో శిక్షణ ప్రారంభించి జూన్ 10 నాటికి పూర్తి చేయాలన్నారు. యోగాపై ఆయా ప్రాంతాల్లో పోటీలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జే.అభిషేక్‌గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, సబ్‌కలెక్టర్ సౌర్యమన్ పటేల్, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:30 PM