ఉత్తుత్తి రుణాలేనా..?!
ABN, Publish Date - May 20 , 2025 | 11:27 PM
వెనుకబడిన తరగతుల వారు రాయితీ రుణాలు పొందడంలోనూ వెనుకబడ్డారు. అధికారుల తీరుతో బీసీలు సబ్సిడీ రుణాలను పొందలేకపోయారు. నెల రోజుల క్రితం కలెక్టర్ దినేశ్‌కుమార్ చేతుల మీదుగా సబ్సిడీ రుణాలను పంపిణీ చేసినట్టు బీసీ వెల్ఫేర్ అధికారులు హడావిడి చేశారు.. కానీ నేటికీ లబ్ధిదారులకు అందలేదు. దీంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కనీసం సమాచారం చెప్పేందుకు జిల్లా కేంద్రంలో అధికారులు అందుబాటులో లేరు. ఇవి ఉత్తుత్తి రుణాలేనా అన్న అనుమానాలను లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు.
అనుమానిస్తున్న బీసీ మహిళలు
సబ్సిడీ రుణాలు అందజేతలో బీసీ వెల్ఫేర్ అధికారుల అలక్ష్యం
ఏప్రిల్ 11న 150 మందికి రూ.4 కోట్లు రుణాలు మంజూరు
కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ
నెల రోజులు దాటినా అందని రుణాలు
బ్యాంకుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ
ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూటమి నేతల ఆవేదన
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
అల్లూరి జిల్లాలోని వెనుకబడిన తరగతులకు చెందిన వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం రాయితీపై స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు 150 మందిని ఎంపిక చేశారు. ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని 150 మంది బీసీ మహిళలకు రూ.4 కోట్ల రాయితీ రుణాల చెక్కును జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అందించారు. వారిలో వంద మందికి రూ.2 లక్షలు చొప్పున, 25 మందికి రూ.3 లక్షలు చొప్పున, 25 మందికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు చొప్పున రుణాలను మంజూరు చేశారు. అలాగే ఏఏ లబ్ధిదారులకు ఏ బ్యాంకులు రుణాలిస్తాయనేది అధికారులు అప్పట్లో ప్రకటించారు. అంతే... ఆ తర్వాత నుంచి రుణాలకు సంబంధించి బీసీ వెల్ఫేర్ అధికారులు, బ్యాంకు అధికారుల నుంచి లబ్ధిదారులకు ఎటువంటి సమాచారం లేదు. దీంతో తమ రుణాల పరిస్థితి ఏమిటని తెలుసుకునేందుకు లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకర్లు సైతం స్పష్టమైన సమాధానం చెప్పకుండా ‘మేమే మీకు త్వరలో ఫోన్ చేస్తాం’ అంటూ కాలం గడిపేస్తున్నారు. అలాగే వాటి గురించి వాకబు చేయడానికి సైతం జిల్లా కేంద్రంలో బీసీ వెల్ఫేర్ కార్యాలయం లేదు. దీంతో తమ రాయితీ రుణాల పరిస్థితి ఏమిటో అర్థంకాక లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు.
అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు
జిల్లాలో బీసీ రుణాల విషయంలో అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పలువురు లబ్ధిదారులు అంటున్నారు. వాస్తవానికి రుణాలు మంజూరు చేసిన వారం లేదా పది రోజుల్లో లబ్ధిదారులకు అందించడం సహజం. కాని రుణాల చెక్‌లను సైతం పంపిణీ చేసినట్టుగా కలెక్టర్‌తో కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. నెల రోజులు దాటుతున్నప్పటికీ రుణాలను అందించకపోవడంతో ప్రభుత్వం ఉత్తుత్తి రుణాలతో తమను మోసగించిందా? అనే అనుమానాలను లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రుణాల అందజేతకు సంబంధించి వ్యవహారాలను అధికారులు సక్రమంగా చేపట్టకపోవడంతో లబ్ధిదారుల్లో అసహనం పెరగడం, దానిని ప్రభుత్వంపై చూపడం వంటివి జరుగుతున్నాయి. అధికారుల తీరుతో తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూటమి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సబ్సిడీ బీసీ రుణాలను అందించాలని కోరుతున్నారు.
Updated Date - May 20 , 2025 | 11:27 PM