జోరుగా అరకు రైల్వే స్టేషన్ పనులు
ABN, Publish Date - May 27 , 2025 | 12:33 AM
అమృత్ భారత్ పథకంలో భాగంగా చేపడుతున్న అరకులోయ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. రైల్వే స్టేషన్‌లో అధునాతన హంగులు ఏర్పాటు కానున్నాయి. రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
అమృత్ భారత్ పథకం కింద ఆధునికీకరణ
ఎల్.ఆకారంలో స్టేషన్ నిర్మాణం
డిసెంబరు నెలాఖరుకు పూర్తి కానున్న పనులు
అరకులోయ, మే 26 (ఆంధ్రజ్యోతి): అమృత్ భారత్ పథకంలో భాగంగా చేపడుతున్న అరకులోయ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. రైల్వే స్టేషన్‌లో అధునాతన హంగులు ఏర్పాటు కానున్నాయి. రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
అమృత్ భారత్ పథకం కింద అరకు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను గత ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌లో ప్రారంభించారు. ఇందుకోసం రూ.15 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్ పక్కనే అన్ని హంగులతో కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. ఎల్.ఆకారంలో రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. భవనానికి శ్లాబ్ వేసేందుకు ఐరన్ డెక్కింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మరో పది రోజుల్లో శ్లాబ్ పనులు పూర్తి కానున్నాయి. అలాగే ప్లాట్‌ఫారంపై షెడ్‌లు ఓ వైపు నిర్మిస్తుండగా.. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్ భవనం జీ ప్లస్-2గా నిర్మిస్తున్నారు. ఇది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని రైల్వే జీఎం ఇటీవల ఆదేశించారు. అమృత్ భారత్ స్కీంలో అరకు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు 2024 అగస్టులో టెండర్లు ఖరారయ్యాయి. అనంతరం పనులు ప్రారంభమయ్యాయి. స్టేషన్ నిర్మాణం ముందు నిర్ణయించిన ప్రకారం జూన్ 2025 నాటికి పూర్తి చేయాలి. అయితే పనులు ఈ మేరకు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. డిసెంబరు వరకు గడువు పెంచాలని కాంట్రాక్టర్ రైల్వే ఉన్నతాధికారులను కోరినట్టు తెలిసింది. ఇందుకు ఉన్నతాధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలిసింది.
Updated Date - May 27 , 2025 | 12:33 AM