‘స్టాండింగ్’లో 93 అంశాలకు ఆమోదం
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:25 AM
నగరంలో వివిధ అభివృద్ధి పనులతో పాటు మార్కెట్ల ఆశీలు, దుకాణాలకు లీజులు, ఉద్యోగుల సర్వీసు విషయాలకు సంబంధించిన 93 అంశాలకు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. జీవీఎంసీ పాత సమావేశ మందిరంలో శనివారం మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది.
విశాఖపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నగరంలో వివిధ అభివృద్ధి పనులతో పాటు మార్కెట్ల ఆశీలు, దుకాణాలకు లీజులు, ఉద్యోగుల సర్వీసు విషయాలకు సంబంధించిన 93 అంశాలకు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. జీవీఎంసీ పాత సమావేశ మందిరంలో శనివారం మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన అజెండాలో పొందుపరిచిన 60 అంశాలతోపాటు టేబుల్ అజెండాలో పొందుపరిచిన 33 అంశాలపై కమిటీ చర్చించి ఆమోదం తెలిపింది. కమిటీ ఆమోదించిన 93 అంశాల్లో రూ.31.03 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించిందని మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీకి ఆదాయం సమకూరే మార్గాలను మరింత అభివృద్ధి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బీచ్ రోడ్డులోని సిల్వర్ స్పూన్ రెస్టారెంట్‌కు లీజుకు ఇచ్చిన స్థలాన్ని మార్కింగ్ చేసి, అందులోనే
వ్యాపార కార్యకలాపాలు సాగించేలా చూడాలని ఆదేశించారు. పార్కుల్లో ప్రవేశ రుసుములు జీవీఎంసీ గెజిట్‌లో నిర్దేశించినట్టుగానే జరిగాలని, ఇందుకోసం పార్కుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని జడ్సీలకు సూచించారు. వర్షాలు ప్రారంభమైనందున నగరంలో దోమల వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ కోసం ఆమోదించిన నిధులను సక్రమంగా వెచ్చించాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.నరేశ్‌కుమార్‌కు ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 12:25 AM