ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమనీయం... అప్పన్న నిజరూపం

ABN, Publish Date - May 01 , 2025 | 01:15 AM

ఏడాదికోసారి నిర్వహించే సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) బుధవారం వైభవంగా జరిగింది.

  • దర్శించి తరించిన భక్తజనం

  • వైభవంగా చందనోత్సవం

  • సింహగిరికి పోటెత్తిన భక్తులు

సింహాచలం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి):

ఏడాదికోసారి నిర్వహించే సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) బుధవారం వైభవంగా జరిగింది. లక్షకుపైగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య అప్పన్నకు పైపూతగా సమర్పించిన చందన విసర్జన కార్యక్రమాన్ని మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత అర్చకులు ప్రారంభించారు. మూలవిరాట్‌పై ఉన్న 12 మణుగుల (500 కిలోలు) సిరి చందనాన్ని నోటికి గుడ్డలు కట్టుకుని రజిత బొరిగెలతో ఒలిచి, స్వామిని నిజరూపంలోకి తీసుకువచ్చారు. అనంతరం స్వామి శిరస్సు, గుండెలపై రెండు చందనపు ముద్దలను ఉంచారు. షోడశోపచార పూజలు చేసిన తరువాత ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించారు. తెల్లవారుజామున 2.45 గంటల నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించారు.

తరలివచ్చిన భక్తులు

స్వామిని నిజరూపంలో దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఒడిశా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో అర్ధరాత్రి నుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రముఖులకు ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పించిన అధికారులు అనంతరం నీలాద్రిగుమ్మం వద్ద గేటుకు తాళాలు వేశారు. ఇదిలావుండగా తెల్లవారుజామున జోడుభద్రాల వద్ద రూ.300 క్యూ సమీపంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందడంతో సర్వత్రా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో భక్తుల రాక తగ్గింది. ఆ తరువాత క్రమేపీ రద్దీ పెరుగుతూ ఉదయం పదిన్నర గంటల సమయానికి నిర్దేశించిన క్యూలను దాటి సుమారు 1.5 కిలోమీటర్ల పొడవున ఘాట్‌రోడ్డుపైకి చేరింది. తెల్లవారుజామున భారీవర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. దీంతో మరింతమంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆ తరువాత వర్షం కురిసినప్పటికీ భక్తుల తాకిడి తగ్గలేదు. పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు సింహాద్రినాథుని నిజరూప దర్శనం చేసుకున్నారు.

సంప్రదాయబద్ధంగా సహస్ర ఘటాభిషేకం

ఆలయ ఆచారం ప్రకారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆధ్యాత్మికవేత్త త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయరుస్వామి పర్యవేక్షణలో సుమారు నాలుగు వందల మంది శ్రీవైష్ణవులు అంతరాలయంలో స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఆ తరువాత తొలివిడత చందన సమర్పణ గావించి, శీతలోపచారాలు సమర్పించి కర్పూర నీరాజనాలిచ్చారు. అప్పన్నను నిత్యరూపంలోకి తీసుకురావడంతో చందనోత్సవం పరిసమాప్తమయింది.

Updated Date - May 01 , 2025 | 01:15 AM