ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మరోసారి తెరపైకి ఏపీ పవర్‌ హౌస్‌

ABN, Publish Date - Apr 17 , 2025 | 10:51 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలో బలిమెల జలాశయం దిగువన ఏపీ పవర్‌ హౌస్‌ నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి జలాశయమైన బలిమెల నుంచి ఆంధ్రా వాటాగా టన్నెల్‌ గేట్ల నుంచి సీలేరు గుంటవాడ జలాశయానికి నీటిని విడుదల చేస్తారు.

బలిమెల జలాశయం దిగువన ఏపీ పవర్‌ హౌస్‌ నిర్మాణానికి నాలుగు దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన ప్రదేశం ఇదే..

నాలుగు దశాబ్దాల క్రితమే నిర్మాణానికి ప్రతిపాదనలు

చిత్రకొండ వద్ద బలిమెల జలాశయం దిగువన 30 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మాణానికి గతంలోనే నిర్ణయం

ఒక గిరిజన గ్రామం, రెండు దేవాలయాలు, ఒక పాఠశాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలతో నిలిచిన ప్రాజెక్టు

తాజాగా రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చతో ప్రాజెక్టుపై కదలిక

సీలేరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలో బలిమెల జలాశయం దిగువన ఏపీ పవర్‌ హౌస్‌ నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి జలాశయమైన బలిమెల నుంచి ఆంధ్రా వాటాగా టన్నెల్‌ గేట్ల నుంచి సీలేరు గుంటవాడ జలాశయానికి నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రదేశంలోనే 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లను 1980 సంవత్సరంలోనే ఉమ్మడిగా నిర్మించడానికి అప్పట్లో ఇరు రాష్ర్టాలు నిర్ణయించాయి. ఇందులో అత్యధిక వాటా ఆంధ్రాకు దక్కేలా ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో రూ.18 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు 1982లో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే 26.5 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం నుంచి 99 సంవత్సరాలకు ఆంధ్రా ప్రభుత్వం లీజుకు తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన సామగ్రిని కూడా రూ.1.77 కోట్లతో కొనుగోలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పనులు చేపట్టడం కోసం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఆ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. 1984లో పవర్‌ హౌస్‌ నిర్మాణానికి తవ్వకం పనులను ప్రారంభించారు.

ఆందోళనలతో ఆగిన పనులు

ప్రాజెక్టు పనుల్లో భాగంగా బ్లాస్టింగ్‌ కోసం నాగపూర్‌కు చెందిన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. బ్లాస్టింగ్‌లు జరిపితే దిగువన ఉన్న గిరిజన గ్రామ (టన్నెల్‌ క్యాంప్‌ గిరిజన గ్రామం) ప్రజలు భారీగా నష్టపోతారని, ముందుగా గిరిజనులకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులు ప్రారంభించాలని పంత్‌ ఒరియా శ్రామిక సంఘం 1985 జూలైలో 15 రోజుల పాటు ఆందోళన చేపట్టింది. పేలుళ్ల వల్ల 299 ఇళ్లు, రెండు దేవాలయాలు, ఒక పాఠశాల దెబ్బతింటాయని, వాటికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రా ప్రభుత్వానికి ఒడిశా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అనంతరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారులు పలుమార్లు ఒడిశా అధికారులతో చర్చలు జరిపినప్పటికీ ఏదో ఒక అడ్డంకి తలెత్తి నాలుగు దశాబ్దాలుగా ఏపీ పవర్‌ హౌస్‌ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పట్లో కొనుగోలు చేసిన భారీ యంత్ర సామగ్రి సీలేరు, డొంకరాయి, పొల్లూరు జెన్‌కో స్టోర్స్‌లో మగ్గుతోంది.

పెరుగుతున్న అంచనా వ్యయం

ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుండడంతో రోజురోజుకు అంచనా వ్యయం పెరుగుతోంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదించిన సమయంలో (1982) రూ.18 కోట్లు అంచనా వ్యయంగా తేల్చారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.300 కోట్లుగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.500 కోట్లు వ్యయం కాగలదని నిపుణులు అంచనా వేశారు. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రాజెక్టును తెరపైకి తేవడంతో అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రాజెక్టు ప్రతిపాదనకు కదలిక

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకు పెరిగిపోతుండడంతో పాటు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత తలెత్తడంతో విద్యుదుత్పత్తి ఖర్చు అధికమైంది. ఈ నేపథ్యంలో ఎటువంటి కాలుష్యం లేకుండా తక్కువ ఖర్చుతో విద్యుత్‌ తయారు చేసే జలవిద్యుత్‌ కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 15న సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో రెండు మినీ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుపై రాష్ట్ర క్యాబినెట్‌లో చర్చ జరిగింది. సీలేరు సమీపంలోని చిత్రకొండ వద్ద బలిమెల జలాశయం దిగువన నాలుగు దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన ఏపీ పవర్‌ హౌస్‌ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే సీలేరు కాంప్లెక్సు ఖాతాలో మరో 60 మెగావాట్ల విద్యుత్‌ వెలుగులు చేరి రాష్ట్రంలోనే తలమానికంగా నిలువనుంది.

Updated Date - Apr 17 , 2025 | 10:51 PM