బీఎన్ రోడ్డు కేసు మరో మలుపు
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:51 AM
బీఎన్ రోడ్డు దారుణ పరిస్థితికి సంబంధించి స్థానిక లీగల్‌సెల్ అథారిటీలో న్యాయవాదులు వేసిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌డీబీ నిధులతో రోడ్డు పనులు పర్యవేక్షిస్తున్న ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్‌తో పాటు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను వచ్చే నెల 23న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని 9వ అదనపు జిల్లా జడ్జి, లీగల్‌సెల్ అథారిటీ చైర్మన్ హరినారాయణ శనివారం నోటీసులు జారీ చేశారు.
- ఆర్‌అండ్‌బీ సీఈ(ఎన్‌డీబీ), కాంట్రాక్టర్‌కు జిల్లా జడ్జి నోటీసులు
- వచ్చే నెల 23న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశం
- రోడ్డుపై గోతులు పూడుస్తున్నట్టు కోర్టుకు విన్నవించిన ఆర్‌అండ్‌బీ ఈఈ
- రహదారి దుస్థితికి కాంట్రాక్టర్ అలసత్వమే కారణమని వెల్లడి
చోడవరం, జూలై 26(ఆంధ్రజ్యోతి): బీఎన్ రోడ్డు దారుణ పరిస్థితికి సంబంధించి స్థానిక లీగల్‌సెల్ అథారిటీలో న్యాయవాదులు వేసిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌డీబీ నిధులతో రోడ్డు పనులు పర్యవేక్షిస్తున్న ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్‌తో పాటు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను వచ్చే నెల 23న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని 9వ అదనపు జిల్లా జడ్జి, లీగల్‌సెల్ అథారిటీ చైర్మన్ హరినారాయణ శనివారం నోటీసులు జారీ చేశారు.
చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని బీఎన్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల గుంతల రోడ్డులో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై స్థానిక న్యాయవాదులు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ ఆధ్వర్యంలో, మరో ఇద్దరు న్యాయవాదులు భరత్‌భూషణ్, భూపతిరాజులు ఈ నెల మొదటివారంలో లీగల్‌సెల్ అథారిటీలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన లీగల్‌సెల్ అథారిటీ చైర్మన్, 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.రత్నకుమార్ కలెక్టర్, ఆర్‌డీవోతో పాటు ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ఏడుగురు ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ శనివారం కోర్టు ఎదుట హాజరుకావాలని ఈ నెల 7న ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్, ప్రభుత్వం తరఫున ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, స్థానిక ఏఈ సత్యప్రసాద్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. బీఎన్ రోడ్డుతో పాటు మాడుగుల రోడ్డు చాలా ఏళ్లుగా నిర్వహణ పనులు చేపట్టకపోవడం వల్ల పూర్తిగా దెబ్బతిన్నదని అంగీకరించారు. కోర్టు నోటీసుల నేపథ్యంలో బీఎన్ రోడ్డులో గుంతల మరమ్మతు పనులు ప్రారంభించామని, పెద్ద పెద్ద గోతులు కప్పుతున్నామని, మిగిలిన గోతులు కూడా కప్పే పనులను కొనసాగిస్తామని ఈఈ వివరించారు. అధికారుల స్పందనపై జిల్లా జడ్జి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రోడ్డు మరమ్మతు పనులు కాకుండా, అసలు ఈ రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని ఆర్‌అండ్‌బీ ఈఈని ప్రశ్నించారు. దీనిపై ఈఈ సమాధానమిస్తూ బీఎన్ రోడ్డులో అభివృద్ధి పనులు ఎన్‌డీబీ నిధులతో చేపట్టిన కాంట్రాక్టర్ ఎ.యశ్వంత్ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు. అయితే ఆ కాంట్రాక్టర్‌తో పనులు చేయించే అధికారం తమకు లేదని, ఎన్‌డీబీ నిధులతో చేపట్టిన పనులు పర్యవేక్షిస్తున్న ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్(ఎన్‌డీబీ)కి మాత్రమే ఉందని చెప్పారు. దీనిపై జిల్లా జడ్జి స్పందించి ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్(ఎన్‌డీబీ)తో పాటు కాంట్రాక్టర్ యశ్వంత్ కూడా వచ్చే నెల 23న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని, వారికి నోటీసులు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
పనులు చేపట్టడం ఆనందదాయకం
అనంతరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ చోడవరం, మాడుగుల రహదారి దుస్థితిపై తాము వేసిన కేసుపై ఆర్ అండ్‌బీ అధికారులు స్పందించి గోతులు పూడ్చివేత పనులు చేపట్టడం ఆనందించదగిన విషయమన్నారు. పెద్ద గోతులు పక్కాగా పూడ్చివేస్తామని అధికారులు ఇచ్చిన హామీని నమ్ముతున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులకు గోతులు పక్కాగా పూడ్చి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా జడ్జి స్పష్టంగా ఆదేశించారని చెప్పారు. వచ్చే నెల 23న ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్, కాంట్రాక్టర్ ఇచ్చే వివరణ అనంతరం, ఈ రోడ్డు పరిస్థితిపై తమ తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
Updated Date - Jul 27 , 2025 | 12:51 AM