హాస్టల్ నిర్వహణపై ఆగ్రహం
ABN, Publish Date - Jul 01 , 2025 | 12:15 AM
ప్రభుత్వ వసతి గృహంలో మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి స్థానిక బీసీ బాలికల కాలేజి హాస్టల్‌ను ఆమె తనిఖీ చేశారు.
మెనూ అమలు చేయకపోవడం, వార్డెన్ లేకపోవడంపై సీరియస్
’పేట’లో బీసీ బాలికల కాలేజి హాస్టల్‌ను తనిఖీ చేసిన హోం మంత్రి అనిత
విద్యార్థినుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వైనం
విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారికి ఆదేశం
పాయకరావుపేట, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతి గృహంలో మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి స్థానిక బీసీ బాలికల కాలేజి హాస్టల్‌ను ఆమె తనిఖీ చేశారు. వసతి గృహంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం, అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, మెనూ సక్రమంగా అమలుచేయకపోవడంపై సీరియస్ అయ్యారు. వసతి గృహంలో సౌకర్యాలను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి మెనూను పరిశీలించారు. వంట మనిషి మెనూ అమలు చేయకపోవడంతో పాటు సన్న బియ్యం వాడకపోవడంపై నిలదీశారు. అనంతరం భోజనం రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారితో ఫోన్‌లో మంత్రి మాట్లాడి వసతి గృహంలో 44 మంది ఆడపిల్లలు ఉంటుండగా, ఇక్కడ వార్డెన్ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తాను వసతి గృహానికి వచ్చి అర్ధగంట కావస్తున్నా వార్డెన్ రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సమగ్ర విచారణ జరిపి రెండ్రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. మంత్రి వెంట వివిధ శాఖల అధికారులున్నారు.
Updated Date - Jul 01 , 2025 | 12:16 AM