ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అసంపూర్తిగానే అల్లూరి మ్యూజియం

ABN, Publish Date - Jul 04 , 2025 | 01:15 AM

అమేయమైన తన పోరాట పటిమతో ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగిని పర్యాటక ప్రాంతంగా దశాబ్దాల క్రితం గుర్తించినా...నేటికీ ఎటువంటి అభివృద్ధి ఛాయలు కానరావడం లేదు.

గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం

సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగిలో మ్యూజియం నిర్మాణానికి గతంలో రూ.2 కోట్లు మంజూరుచేసిన టీడీపీ ప్రభుత్వం

వైసీపీ వచ్చిన తరువాత కేటాయింపులు రద్దు

మళ్లీ 2019లో మంజూరు, శంకుస్థాపన

ఐదేళ్లలో పనులు పూర్తికాని వైనం

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో విఫలం

పద్మనాభం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):

అమేయమైన తన పోరాట పటిమతో ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగిని పర్యాటక ప్రాంతంగా దశాబ్దాల క్రితం గుర్తించినా...నేటికీ ఎటువంటి అభివృద్ధి ఛాయలు కానరావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం అల్లూరి జన్మస్థలాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పాలకులు ఏటా ఆయన జయంతి రోజున హడావిడి చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి చేతులు దులుపుకోవడం తప్ప స్ఫూర్తివంతమైన ఈ ప్రాంతాన్ని భావి తరాలకు పరిచయం చేయాలన్న ఆలోచనకు కార్యరూపం ఇవ్వలేకపోతున్నారు.

పాండ్రంగిలోనే జన్మించిన, ఈ స్థల మహత్యం గురించి అవగాహన ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1996లో అల్లూరి శత జయంతి ఉత్సవాలను నిర్వహించి అప్పటి రాష్ట్ర గవర్నర్‌ కె.కృష్ణకాంత్‌, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, సినీ నటుడు కృష్ణ వంటి వారిని రప్పించారు. ఆ మహనీయుని స్మారకార్థం అల్లూరి సామాజిక వేదిక, అల్లూరి విగ్రహం, అల్లూరి ఆరోగ్య ఉపకేంద్రం, అల్లూరి పశువైద్యశాల వంటి వాటిని నెలకొల్పారు. 2001లో నాటి పర్యాటక శాఖా మంత్రి గౌతు శ్యామసుందరశివాజీ మంజూరుచేసిన నిధులతో అల్లూరి జనన గృహాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించారు. అనంతర కాలంలో పాలకులు ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. 2014లో భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా శ్రీనివాసరావు చొరవతో మరికొన్ని అభివృద్ధి పనులను కొంతవరకూ చేపట్టారు. అల్లూరి సామాజిక వేదిక ఆధునికీకరణ, అల్లూరి పార్కులో నూతన విగ్రహం ఏర్పాటు, అల్లూరి పార్కు అభివృద్ధి వంటి పనులను అప్పటి ఎంపీ కంభంపాటి హరిబాబు ఎంపీ నిధులు, ఇతర నిధులతో చేయించారు. అల్లూరి మ్యూజియానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. అనంతరం వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ నిధుల కేటాయింపును రద్దు చేసింది. మళ్లీ తాము కొత్తగా నిధులు మంజూరు చేశామని ప్రకటించి 2019 డిసెంబరు 23న రూ.2 కోట్లతో అల్లూరి మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ మ్యూజియం నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. ఈ గ్రామాన్ని ఒక శ్రద్ధా కేంద్రంగా నిలిపి అల్లూరి జన్మ స్థలాన్ని పర్యాటకులు, ఇతర ఔత్సాహికులు, చరిత్ర పరిశోధకులు సందర్శించే విధంగా తీర్చిదిద్దడంలో గత ప్రభుత్వ పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. నాడు పర్యాటక శాఖా మంత్రిగా పనిచేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు నగర సందర్శనకు వచ్చే పర్యాటకులు పద్మనాభం మండలంలోని అల్లూరి జన్మస్థలం, పద్మనాభ యుద్ధ స్థలం, పొట్నూరు శ్రీకృష్ణదేవరాయల విజయస్థూపం వంటి చారిత్రక స్థలాలతో పాటు, ఆలయాలను పర్యాటకులు సందర్శించే విధంగా ప్రత్యేక ప్యాకేజీ రూపొందిస్తామని ప్రకటించారు. కానీ, ఆ హామీ ప్రకటనలకే పరిమితమయ్యింది. ఇక అల్లూరి జనన గృహ అభివృద్ధి పనులు కూడా గత ఏడాది నుంచి ఇప్పటికీ కొనసా...గుతూనే ఉన్నాయి. 2014లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఉన్న సమయంలోనే అల్లూరి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని జీవో జారీచేశారు. ఆయన హయాంలోనైనా ఈ ప్రాంతానికి పర్యాటకంగా ప్రాచుర్యం కల్పించి, అల్లూరి జనన స్థలాన్ని భావితరాలు సందర్శించి స్ఫూర్తిని పొందే విధంగా తీర్చిదిద్దాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు.

Updated Date - Jul 04 , 2025 | 01:15 AM