ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గిన్నిస్‌ రికార్డ్డుపై గురి

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:50 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ‘యోగాంధ్ర’ పేరుతో నగరంలో నిర్వహిస్తున్న కార్యక్రమంతో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి.

  • బీచ్‌రోడ్డులో 3.6 లక్షల మందితో యోగా

  • 29.8 కిలోమీటర్లు...326 కంపార్టుమెంట్లు

  • పార్క్‌ హోటల్‌ వరకు కంపార్టుమెంట్‌కు వెయ్యి మంది

  • ఆపై 672/1350 మంది

  • ప్రతి కంపార్ట్‌మెంట్‌కు 30 మంది సేవకులు

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ‘యోగాంధ్ర’ పేరుతో నగరంలో నిర్వహిస్తున్న కార్యక్రమంతో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. ఇందుకోసం ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ 29.8 కి.మీ. పొడవున పచ్చటి తివాచీలు పరిచి యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లుచేశారు. ఒక్క బీచ్‌రోడ్డులోనే మొత్తం 3.6 లక్షల మందితో యోగాసనాలు వేయించాలనేది లక్ష్యం. ఇందుకోసం 326 కంపార్టుమెంట్లు పెట్టారు. ఆర్‌కే బీచ్‌ నుంచి పార్క్‌ హోటల్‌ వరకూ ప్రతి కంపార్టుమెంట్‌కు కేవలం వేయిమందినే అనుమతిస్తారు. వీటిలో తర్ఫీదు పొందినవారు మాత్రమే యోగాసనాలు వేస్తారు. ఆ తరువాత వుడా పార్క్‌ నుంచి భీమిలి వరకూ మిగిలిన కంపార్టుమెంట్లను రెండు సైజుల్లో తయారుచేశారు. ఒక దాంట్లో 672 మంది, మరో దాంట్లో 1,350 మంది పడతారు. ఎవరు ఏ కంపార్టుమెంట్‌లోకి వెళ్లాలనేది వార్డు, గ్రామ సచివాలయాలతో మ్యాపింగ్‌ చేశారు. సచివాలయాల సిబ్బందికి వారిని తీసుకువెళ్లే బాధ్యత అప్పగించారు.

ప్రతిచోట 30 మంది సేవకులు

ప్రతి కంపార్టుమెంట్‌కు గెజిటెడ్‌ అధికారిని ఇన్‌చార్జిగా వేశారు. ఒక యోగా ఇన్‌స్ట్రక్టర్‌, ముగ్గురు యోగా డిమాన్‌స్ట్రేటర్లు, పది మంది వలంటీర్లు, తాగునీటి సరఫరాకు ఒక ఇన్‌చార్జి, ఆహారం సరఫరాకు ఒకరు, పర్యవేక్షణకు ఇద్దరు సూపర్‌వైజర్లు, శానిటేషన్‌కు నలుగురు, రెండు టాయిలెట్లకు ఒకరు చొప్పున క్లీనర్‌, ఒక ఏఎన్‌ఎం, ఒక ఆశ వర్కర్‌, నలుగురు కలాసీలను కేటాయించారు. వీరంతా ఆ కంపార్టుమెంట్‌లో ఆసనాలు వేసే వారికి సేవలు అందిస్తారు.

ఏయూలో 26,395 మంది

గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు

పరిశీలించనున్న పీఎం నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కర్యాక్రమం ఏర్పాటుచేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ఈ ప్రదర్శన ఉంటుంది. ఆ రోజున వర్షం పడితే బీచ్‌రోడ్డులో కార్యక్రమం రద్దు చేసి మొత్తం కార్యక్రమం ఇదే వేదిక వద్ద నిర్వహిస్తారు. వాతావరణం అనుకూలంగా ఉంటే...బీచ్‌ రోడ్డులో గిన్నిస్‌ రికార్డు పూర్తయిన తరువాత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడులు ఏయూకు వచ్చి విద్యార్థుల సూర్య నమస్కారాలను పది నిమిషాల పాటు పరిశీలిస్తారు. కాగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి వెళ్లి ఏర్పాట్లు పరిశీలిస్తారు. గిరిజన విద్యార్థులను ఏజెన్సీలోని 106 పాఠశాలల నుంచి 495 బస్సుల్లో విశాఖపట్నం తీసుకువస్తున్నారు.

వేకువజామున 3 గంటలకే వేకప్‌ కాల్‌

కాలకృత్యాలు తీర్చుకుని వార్డులో

నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోవాలి

4.30 గంటల నుంచే బస్సుల్లో

బీచ్‌రోడ్డుకు తరలింపు

కంపార్టుమెంట్‌ వద్ద క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌

ప్రతి ఒక్కరికీ టీ షర్ట్‌, అల్పాహారంతో

కూడిన ప్యాకెట్‌ అందజేత

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

బీచ్‌ రోడ్డులో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే వారికి శనివారం ఉదయం మూడు గంటలకే వార్డు సచివాలయం నుంచి ‘వేకప్‌ కాల్‌’ వస్తుంది. ఆ ఫోన్‌ రాగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూచించిన ప్రదేశానికి చేరుకోవాలి. వార్డు నుంచి ఉదయం 4.30 గంటలకే బస్సులు బీచ్‌రోడ్డుకు బయలుదేరతాయి. 5.30 గంటల తరువాత బీచ్‌కు వచ్చే బస్సులను భద్రతా కారణాల రీత్యా అనుమతించరు. అందుకని ఉదయం ఐదు గంటల కల్లా నగరంలో అన్ని బస్సులు నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోవలసి ఉంటుంది.

- బస్సును పార్కింగ్‌లో నిలిపిన తరువాత అందరినీ వార్డు సిబ్బంది నిర్దేశించిన కంపార్టుమెంట్ల వద్దకు తీసుకువెళతారు.

- అక్కడ ప్రతి ఒక్కరికీ స్టిక్కర్‌ అంటించి దానిపై క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తారు. అది గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం ఉపయోగపడుతుంది. ఆ తరువాత కంపార్టుమెంట్‌లో నిర్దేశించిన ప్రాంతానికి పంపుతారు. అక్కడ యోగాసానాలు వేయడానికి మ్యాట్‌ సిద్ధంగా ఉంంది.

- మ్యాట్‌పై కూర్చోగానే ‘యోగాంధ్ర’ టీ షర్ట్‌, అల్పాహారంతో కూడిన ఒక ప్యాకెట్‌ ఇస్తారు. అందులో బిస్కెట్‌, బత్తాయి, అరటిపండు వంటివి ఉంటాయి. ఓఆర్‌ఎస్‌ బాటిల్‌ కూడా ఇస్తారు.

- కార్యక్రమం ముగిసిన తరువాత అల్పాహారం అక్కడే తీసుకోవాలి.

- కంపార్టుమెంట్‌ నుంచి తిరిగి బస్సు దిగిన ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడి నుంచి వార్డుకు తీసుకువెళతారు.

- కార్యక్రమం ముగిసే వరకు వార్డు సచివాలయ సిబ్బందితో టచ్‌లో ఉండాలి.

- కంపార్టుమెంట్‌కు పక్కనే టాయిలెట్‌, తాగునీటి సదుపాయం ఉంటాయి.

యోగాంధ్రలో పాల్గొనడం ఎలాగంటే...

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

రామకృష్ణా బీచ్‌లో శనివారం ఉదయం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం (యోగాంధ్రా) కార్యక్రమానికి చేరుకోవడం ఎలా?...అనే దానిపై చాలామందిలో సందేహాలు ఉన్నాయి. నగరంలో ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటే...తప్పనిసరిగా వారు ఉంటున్న వార్డు సచివాలయానికి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. ప్రతి వార్డుకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలు వచ్చి నిర్దేశించిన ప్రాంతానికి తీసుకువెళతాయి.

వార్డులకు వాహనాలు...

ప్రతి వార్డు నుంచి పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి వాహనాలు కేటాయించారు. సభ్యులు బీచ్‌లో ఏ నంబరు కంపార్టుమెంట్లోకి వెళ్లాలనేది కూడా అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. వార్డు సచివాలయ సిబ్బంది అన్నీ చూసుకుంటారు. బస్సు ఎక్కించడం దగ్గర నుంచి కంపార్టుమెంట్‌కు తీసుకువెళ్లి, అక్కడ మళ్లీ రిజిస్టర్‌ చేయించి, కిట్లు అందిస్తారు. కార్యక్రమం ముగిసిన తరువాత మళ్లీ బస్సు ఎక్కడ ఆగిందో అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి తిరిగి వార్డుకు తీసుకువెళతారు.

వాహనాల పార్కింగ్‌ కోసం 75 ప్రాంతాలను ఎంపిక చేశారు. నిర్దేశిత సమయానికి వార్డులో బస్సు ఎక్కకపోతే బీచ్‌ రోడ్డుకు చేరడం కష్టం. సచివాలయ సిబ్బంది శుక్రవారం రాత్రి నుంచే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి టచ్‌లో ఉంటారు. వారితోనే సమన్వయం చేసుకోవాలి. విద్యార్థులు, యువతీ యువకులు, ఆసక్తి కలిగినవారు ఎవరైనా సరే సచివాలయంలో రిజిస్టర్‌ చేసుకుంటనే బీచ్‌రోడ్డులో కార్యక్రమానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

Updated Date - Jun 20 , 2025 | 12:50 AM