ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ, రోబోటిక్స్ ల్యాబ్‌లు
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:35 AM
ప్రభుత్వ పాఠశాలల్లో రూ.8 కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లేబొరేటరీలు ఏర్పాటు చేయడానికి ‘సైయెంట్’ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన సైల్ ఫౌండేషన్ ముందుకు వచ్చినట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.
రూ.8 కోట్లతో ఏర్పాటుచేయబోతున్న ‘సైయెంట్’
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో రూ.8 కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లేబొరేటరీలు ఏర్పాటు చేయడానికి ‘సైయెంట్’ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన సైల్ ఫౌండేషన్ ముందుకు వచ్చినట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంవీపీ కాలనీలోని తన గృహంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ 25 వేల మంది విద్యార్థులకు ఆ అంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు. భీమిలి నియోజకవర్గంలో 28 పాఠశాలల్లో జూలై రెండో వారంలో ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. శిక్షణ ఫలితాలు చూసి దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సంస్థ చైర్మన్ మోహన్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఏఐ లేబొరేటరీల నిర్వహణ భాగస్వామి గణేశ్, ఫౌండేషన్ ఫైనాన్స్ మేనేజర్ పీవీఎస్ శర్మ పాల్గొన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 12:35 AM