ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెకానికల్‌లో అడ్వైజర్‌ గోల

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:29 AM

జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో అడ్వైజర్‌ నియామకం గందరగోళం రేపుతోంది.

  • జీవీఎంసీ వాహనాల నిర్వహణపై సలహాలకు ప్రైవేటు వ్యక్తి

  • ఈ ఏడాది మార్చి వరకు పనిచేసిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి

  • పొడిగింపు ఉత్తర్వులు లేకున్నా గత నెల ఒకటి నుంచి విధుల్లోకి

  • ఉన్నతాధికారి అండదండలతోనే కొనసాగింపు?

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో అడ్వైజర్‌ నియామకం గందరగోళం రేపుతోంది. జీవీఎంసీ వాహనాల పర్యవేక్షణకు గత ఏడాది మార్చిలో అప్పటి కమిషనర్‌ సాయికాంత్‌వర్మ ఆర్టీసీ మెకానికల్‌ విభాగంలో విశ్రాంత ఉద్యోగిని ఏడాది కాలానికి అడ్వైజర్‌గా నియమించారు. ఈ ఏడాది మార్చితో అతని గడువు ముగిసింది. తాజాగా గతనెల ఒకటి నుంచి ఈ విభాగంలో మళ్లీ హడావుడి ప్రారంభించారు. కమిషనర్‌తో జరిగే సమీక్షలకు కూడా హాజరవుతున్నారు. నియామక ఉత్తర్వులు లేకపోయినా గొంతెమ్మ కోర్కెలను తీర్చాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ఆ విభాగం అధికారులు, సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.

ప్రజారోగ్యం, యూజీడీ, హర్టీకల్చర్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాలతోపాటు అధికారులు విధి నిర్వహణలో తిరిగేందుకు అవసరమైన కార్లు జీవీఎంసీకి ఉన్నాయి. వీటి నిర్వహణ, మరమ్మతులను మెకానికల్‌ విభాగం చూస్తుంటుంది. ఈ విభాగంలో కొందరు అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటికి అడ్డుకట్టవేయడంతోపాటు వాహన మరమ్మతులను గుర్తించి, ప్రతిపాదనల మేరకు, కాంట్రాక్టర్లతో పూర్తిచేయించే బాధ్యతలను ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగికి అప్పగించారు. అతనికి గౌరవభత్యం కింద నెలకు సుమారు రూ.లక్షతోపాటు కారు సదుపాయం కల్పిస్తూ, ఏడాదికాలానికి నియమించారు. ఈ ఏడాది మార్చితో అడ్వైజర్‌ గడువు ముగిసింది. తర్వాత పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో సర్వీసు పొడిగించలేదు. అప్పటినుంచి మెకానికల్‌ విభాగం ఇంజనీర్లే వాహన మరమ్మతులను చూసుకుంటున్నారు. కానీ గతనెల ఒకటి నుంచి అదే ఉద్యోగి హడావుడి చేస్తున్నారు. తనను కమిషనర్‌ నియమించారని చెబుతూ, మెకానికల్‌ విభాగంపై కమిషనర్‌ నిర్వహించే సమీక్షలకు కూడా హాజరైపోతున్నారు. నెలరోజులు గడిచినా నియామక ఉత్తర్వులు జారీకాకపోవడంతో అధికారుల్లో అనుమానం మొదలైంది.

గొంతెమ్మ కోర్కెల చిట్టా

అడ్వైజర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని అధికారులు వాపోతున్నారు. కాలపరిమితి ముగిసినా జీవీఎంసీకి కారు అప్పగించలేదు. పైగా అది ప్రైవేటు కాంట్రాక్టర్‌ కారు కావడంతో నాలుగునెలల బిల్లు చెల్లించాలని ఒత్తిడిచేస్తున్నారు. పోస్టు శాంక్షన్‌ కాకుండా బిల్లు పెట్టలేమని అధికారులు చెబుతున్నా, జీవీఎంసీలో ఉన్నతాధికారి అండదండలున్నాయని, అతని ద్వారా కమిషనర్‌కు చెప్పిస్తానంటున్నారు. దీంతో మెకానికల్‌ విభాగం అధికారులు, సిబ్బంది ఎదురుచెప్పేందుకు సాహసించలేకపోతున్నారు. అంతేకాకుండా ఈ విభాగంలోని వాహనాల మరమ్మతులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కమిషనర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులకు తెలిసేలా ఒక ప్రైవేటు ఏజెన్సీ రూపొందించిన యాప్‌కు బిల్లు చెల్లించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇటీవల మెకానికల్‌ విభాగంపై కమిషనర్‌ సమీక్ష నిర్వహించినపుడు ఈ యాప్‌పై సూచించినట్టు చెబుతున్నారు. గతంలో ’ఇంట్రోల్యాబ్స్‌’ అనే సంస్థ అభివృద్ధిచేసిన యాప్‌ను వాహన రిపేర్లను ట్రాకింగ్‌ చేయడానికి వినియోగించేవారు. అందుకోసం ఏజెన్సీకి జీవీఎంసీ నుంచి నెలకు రూ.70 వేలు చెల్లించేవారు. గత ఆరు నెలలుగా ఆ యాప్‌ పనిచేయడంలేదు. తాజాగా అదే యాప్‌ సేవలను వినియోగించుకుంటే పనిచేయని ఆరునెలలకు బిల్లు పెట్టించి కొట్టేయవచ్చని కమిషనర్‌ వద్ద ప్రస్తావించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెకానికల్‌ విభాగంలో అనుభవం, నైపుణ్యం ఉన్న ఇంజనీర్లుండగా, ప్రైవేటు వ్యక్తికి నియమించాల్సిన అవసరమేమిటని ఆ విభాగం అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Aug 04 , 2025 | 12:29 AM